రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచడంపై నగర పౌరులు నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన దండెత్తారు. వందలాది మంది కార్యకర్తలు విజయవాడ నగర వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేష్‌కు చేరుకుంటున్న ఆందోళన కారులను పోలీసులు బలవంతంగా వ్యానుల్లోకి ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా సీపిఎం, సిపీఐ నాయకులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఈ ఛలో కార్పొరేషన్ ఆందోళన చేయద్దని పోలీసులు ముందుగానే 144 సెక్షన్ ఆంక్షల నోటీసులను వామ పక్ష నేతలకు ఇచ్చారు. చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. అయినా, వామపక్ష కార్యకర్తలు మొండిగా ర్యాలీ తీశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి చేరారు. దీనితో వారందరినీ చెదరగొట్టి అరెస్టులు చేస్తుండటంతో నగరం ఉద్రిక్తంగా మారింది.
విజయవాడలో సిపిఐ, సిపిఎం నాయకుల హౌస్ అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. పోలీసులను ప్రయోగించి ప్రజా ఉద్యమాలను ఆపాలనుకోవడం అవివేకమన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, చెత్తపన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండు చేశారు.