పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని కొత్తగా ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా హై కోర్టు ఉత్తర్వులు మేరకు అక్టోబర్ 29న కొత్తగా 1327 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధించారు.
వారంతా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం (ఏపిపిఎస్సీ) ఎదుట తమ డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని ప్రదర్శిస్తూ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ తమకు కమిషనర్ 45 రోజుల సమయం ఇచ్చి షెడ్యూల్ తయారు చేశారని తెలిపారు.
మొదటి జాబితాలో గ్రూప్-1కి ఎంపిక అవ్వని అభ్యర్థులు ఇతరత్రా పరీక్షలకు ఎంపికవడం జరిగింది. అయితే కోర్టు ఉత్తర్వుల మేరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్-1 ప్రధాన పరీక్ష, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలు ఒకే సమయంలో ఉన్నందున మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సుమారు ఏడాది పాటు సమయం ఇవ్వడం జరిగిందని అన్నారు.
అదేవిధంగా ప్రస్తుతం పరీక్షకు సిద్ధమవుతున్న తమకు కూడా గడువును పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అభ్యర్థులు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. గ్రూప్-1 పరీక్ష గడువు తేదీని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు ఏపిపిఎస్సీ కార్యాలయం వద్దకు విచ్చేసి నిరసన వ్యక్తం చేశారు.