గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి సాధించారు పోలీసులు. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడిని గుంటూరు అర్బన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం.
నిందితుడు కృష్ణానా? వెంకటరెడ్డా? అనేది తెలియాల్సి ఉంది. ఒంగోలులో తిష్టవేసిన పోలీసులు 30 రోజుల పాటు వివిధ వేషధారణలతో యాచకుల దగ్గర్నుంచి.. హిజ్రాలను, సమోసాలు అమ్ముకునే వారిని, రైల్వే ట్రాక్‌ల పక్కన చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ ఎట్టకేలకు ఒంగోలు ఫ్లై ఓవర్ కింద సేదదీరుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రెండో నిందితుడు కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం రావడంతో గుంటూరు అర్బన్ నుంచి వెళ్లిన పలు బృందాలు ఒంగోలు రైల్వే ట్రాక్‌లు, ఇతర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. చెన్నై రైల్వే మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి అన్వేషిస్తున్నారు పోలీసులు.