ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15 వేల నగదును ప్రభుత్వం విద్యార్థి తల్లి ఖాతాలో జమచేస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి స్థాయి విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
అయితే, ఈ యేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తరగతులు సంక్రమంగా జరగలేదు. కొన్ని పాఠశాలలు మాత్రమే 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు స్కూళ్లు 5, 6 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు మొదలుపెట్టాయి.
ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ప్రాథమిక స్థాయిలోనే ఇంత భారం ఎందుకని, తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు అర్థం కావడం లేదనే ఉద్దేశంతో ఇంటివద్దనే వారిని చదివిస్తున్నారు. సప్తగిరి ఛానల్‌లో వచ్చే కార్యక్రమాలు చూపించడం వంటివి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఈ పథకంలో అర్హులైన వారికి రూ.15 వేలు బ్యాంకు ఖాతాల్లో వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 15లోగా విద్యార్థుల వివరాలను అప్‌డేట్ చేయాలని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్‌కు వర్తమానం పంపింది.
ఈ పథకం వర్తించాలంటే తల్లిదండ్రులు బీపీఎల్ కేటగిరిలో ఉండాలి. ఈ క్రమంలో విద్యార్థుల డేటాను అప్‌డేట్ చేయాలంటే ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావాల్సిందేనని ప్రైవేటు స్కూల్స్ హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.
ప్రభుత్వం అమలుచేసే అమ్మఒడి పథకం నగదుపై ప్రైవేటు పాఠశాలలు కన్నేశాయి. ఆన్‌లైన్ క్లాసులకు హాజరైన వారి డేటాను మాత్రమే అమ్మఒడి పథకానికి పంపుతామని, మిలిగిన వారిని గైర్హాజరులో చూపుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నాయి.