తూనికలు, కొలతల శాఖ పఠిష్టతకు చర్యలు... మంత్రి ప్రత్తిపాటి
అమరావతి : వినియోగదారులు మోసపోకుండా వుండేందుకు తూనికలు, కొలతల శాఖను పటిష్టపరుస్తామని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ శాఖల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయంలోని తన కార్యాలయంలో లీగల్ మెట్రాలజీ శాఖకు చెందిన 13 జిల్లాల
అమరావతి : వినియోగదారులు మోసపోకుండా వుండేందుకు తూనికలు, కొలతల శాఖను పటిష్టపరుస్తామని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ శాఖల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయంలోని తన కార్యాలయంలో లీగల్ మెట్రాలజీ శాఖకు చెందిన 13 జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సోమవారం మధ్యాహ్నం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులు అన్ని విధాల మోసపోతున్నట్లు తమ సమీక్షలో స్పష్టమైందన్నారు. పెట్రోలు, ఎరువులు, సిమెంట్, గ్యాస్, ఆస్పత్రులు, కిరోసిన్ హాకర్ల వద్ద, రైస్ మిల్లులు, బేకరీలు అన్ని చోట్ల వినియోగదారులు మోసపోతున్నారని వివరించారు.
బంగారం షాపుల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, పన్నులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. చివరకు సెలక్ట్ చానల్ పేరుతో రూ.20ల మంచి నీళ్ల బాటిళ్లు కూడా రూ.50లకు అమ్ముతున్నారని చెప్పారు. తమ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ పెనాల్టీ విధిస్తున్నట్లు, తూనికలు, కొలతల్లో తక్కువగా ఉన్న సరుకులను నింపిస్తున్నట్లు పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కాంపౌండ్ ఫీజు కింద రూ. 8.60 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
75 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ తక్కువగా పోస్తున్నట్లు అధికారులు గుర్తించారని, గుణదలలోని బంకు లైసెన్స్ రద్దు చేయమని సిఫారసు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరరకు అమ్మినా, తరుగు వచ్చినా ఆ కంపెనీలపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఎరువుల దుకాణాల్లో కూడా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 9 కంపెనీలకు చెందిన ఎరువుల బస్తాల్లో ఒక్కోదాంట్లో రెండు కిలోల వరకు తరుగు వస్తున్నట్లు తెలిపారు. అలా 40 వేల బస్తాల్తో తరుగు వచ్చినట్లు చెప్పారు.
సిమెంట్ బస్తాల్లో కూడా రెండేసి కిలోల చొప్పున తరుగు వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 26 వేబ్రిడ్జిలలో కూడా లోపాలు ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో సరఫరా చేసే మందులు, ఇతర వస్తువుల్లో తరుగులు వస్తే ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మంత్రి చెప్పారు. అటువంటివాటిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గ్యాస్ సిలెండర్‌కు రెండు కిలోల తక్కువగా ఉన్నట్లు తమ సిబ్బంది గుర్తించారని చెప్పారు. గ్యాస్ కంపెనీలను నియంత్రిస్తామన్నారు.
1671 ప్రభుత్వ చౌక దుకాణాల్లో, 68 రైస్ మిల్లుల్లో, 14 కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లుల్లో తరుగులు వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఎక్కడ మోసం జరుగుతున్నా వినియోగదారులు వెంటనే తెలియజేయడానికి తమ శాఖ తరపున టోల్ ఫ్రీ నెంబర్‌ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఖాళీ పోస్టులు 95
తమ శాఖలో సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల కూడా దాడులు నిర్వహించడం కష్టంగా ఉందని చెప్పారు. తగినంత సిబ్బందిలేక తనిఖీలు నిర్వహించలేకపోతున్నారన్నారు. 95 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే పరిస్థితి వివరించి ఖాళీలను భర్తి చేస్తామన్నారు. వినియోగదారులు మోసపోకుండా, వారికి మేలు జరిగే విధంగా మోసాలు అరికడతామన్నారు.
కేంద్రం నిధులు రూ.50 కోట్లు
రాష్ట్రంలో లీగల్ మెట్రాలజీ శాఖ ల్యాబులు, కార్యాలయ భవనాల నిర్మాణానికి కేద్రం ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. స్థలాలు కేటాయించమని తమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లను కోరుతున్నారని, కేటాయించగానే నిర్మాణం మొదలుపెడతామని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు.