ప్రజావేదిక కూల్చివేత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేత పనులు మంగళవారం రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో బుధవారం ఉదయానికల్లా ప్రజావేదిక నామరూపాల్లేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నంకల్లా ఈ కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రజా వేదికను గత టీడీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. ఇందుకోసం తొలుత రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత ఈ అంచనాలను రూ.8.5 కోట్లకు పెంచేసి, ఈ ప్రజా వేదిక నిర్మాణం పూర్తి చేశారు.
అయితే, కృష్ణానది కరకట్ట ప్రాంత సమీపంలో ఎలాంటి పక్కా నిర్మాణాలు ఉండరాదన్న నిబంధనలతో పాటు.. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఇతర నిబంధనలు తుంగలో తొక్కి ఈ భవనాన్ని నిర్మించారు. ఒకరకంగా ప్రభుత్వమే ఈ అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీన్ని కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే, ఇక సామాన్యులు నిర్మించిన అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏంటంటూ జగన్ ప్రశ్నించారు. పైగా, ఇలాంటి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించబోమని, అందువల్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ ప్రజావేదిక నుంచే ప్రారంభమవుతుందని తేల్చిచెప్పి, ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు.
దీంతో మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ భవన నిర్మాణం కూల్చివేత పనులు బుధవారం ఉదయానికి 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. బుధవారం ఉదయం వర్షం కురవడంతో, కూల్చివేత పనులకు స్వల్ప ఆటంకం కలిగింది. అనంతరం, కూల్చివేతను మళ్లీ కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ... ఊహించని విధంగా మంగళవారం రాత్రి నుంచే పనులు మొదలు పెట్టారు. మరోవైపు, ప్రజావేదికతో పాటు కరకట్ట ప్రాంతాన్ని మొత్తం భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇదిలావుంటే, కరకట్ట ప్రాంతంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తన ఇంటిని నిర్మించుకున్నారు. ఇపుడు అందరి దృష్టి ఈ ఇంటిపై పడింది.