టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు చేసినప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఆయన దేవుడిగానే కనిపిస్తారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన ఏపీలో వాలంటీర్లు, పెన్షన్ల అంశంపై స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని తెలిపారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పురికొల్పింది చంద్రబాబే అని ఆరోపించారు. వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేక పోయారని, అందుకే ఇంటివద్దనే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
"ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు, రాజకీయ భవిష్యత్ కోసం నాడు రంగాను పొట్టనబెట్టుకున్నారు. ఇపుడు రాజకీయ కోసం పవన్ కళ్యాణ్‌ను లొంగదీసుకున్నారు. పవన్‌ను పక్కనబెట్టుకుని కాపులను తనకు ఊడిగం చేయించుకునేలా చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్. చంద్రబాబు గతంలో కాపులను రౌడీలు అనలేదా, చంద్రబాబు ఎన్ని అన్యాయాలు చేసినా పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఆయన దేవుడు అంటూ పోసాని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా సొంతంగా ఒక పార్టీ పెట్టాడా, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు... తన రాజకీయ భవిష్యత్ కోసం ఏమైనా చేస్తారు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.