Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ అడ్రస్ మాయం: వైకాపాకు బంపర్ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలోని 22 మంది ఎమ్మెల్సీలు ఈ ఏడాది పదవీ విరమణ చేయనుండటంతో ప్రతిపక్ష వైకాపాకు బంపర్ ఛాన్స్ తగులుతోంది. దీంతో మండలిలో రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మండలిలో కాంగ్రెస్ ఖాళీ అవటం, ఇటు వైకాపాకు మండలిలో గణన

ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ అడ్రస్ మాయం: వైకాపాకు బంపర్ ఛాన్స్
హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (05:56 IST)
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలోని 22 మంది ఎమ్మెల్సీలు ఈ ఏడాది పదవీ విరమణ చేయనుండటంతో ప్రతిపక్ష వైకాపాకు బంపర్ ఛాన్స్ తగులుతోంది.  దీంతో మండలిలో రాజకీయ పార్టీల బలాబలాల్లో  మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మండలిలో కాంగ్రెస్ ఖాళీ అవటం, ఇటు వైకాపాకు మండలిలో గణనీయంగా స్థానాలు లభించనుండటంతో  వైఎస్సార్‌సీపీకి పెద్దల సభలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కబోతోంది. 
 
మండలిలో మొత్తం 58 మంది సభ్యులుండగా.. ఐదుగురు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి.. మరో ఐదుగురు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి, 20 మంది స్థానిక సంస్థల కోటాలో, ఇంకో 20 మంది ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికవుతారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించే 8 మందిని గవర్నర్‌ ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తారు.
 
మొత్తం 58 మంది ఎమ్మెల్సీల్లో ప్రతి రెండేళ్లకోసారి మూడో వంతు సభ్యులు పదవీ విరమణ చేయడంతో ఏర్పడే ఖాళీలకు ఎప్పటికప్పుడు కొత్తగా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది ఖాళీ అయ్యే స్థానాల్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతోపాటు తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలోగానీ, లేదంటే ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత గవర్నర్‌ కోటాలో ఖాళీ అయ్యే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గవర్నర్‌ కొత్త వారిని నియమిస్తారు.
 
శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీ గత మూడేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగి ఉంది. ఆ పార్టీ ఈ ఏడాది మండలిలో ఆ హోదాను కోల్పోనుంది. అధికారిక లెక్కల ప్రకారం... మొత్తం 58 మంది సభ్యులుండే మండలిలో అధికార టీడీపీకి ఇప్పుడు (పదవీ విరమణ చేసిన వారితో కలిపి) 23 మంది సభ్యుల బలం ఉంది. రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌కు 8 మంది సభ్యులున్నారు. వైఎస్సార్‌సీపీకి ఐదుగురు ఉన్నారు. కాంగ్రెస్‌కు సభ్యుల్లో ఏడుగురు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న సి.రామచంద్రయ్య పదవీకాలం ముగుస్తోంది. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం, స్థానిక సంస్థల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికైన వారు కూడా తక్కువగా ఉండడంతో ఎన్నికలు జరిగే స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు.
 
అదే సమయంలో మండలిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల్లో ఈ ఏడాది ఎవరూ పదవీ విరమణ చేసే వారిలో లేరు. కొత్తగా ఎన్నికలు జరిగే చోట వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి పెద్దసంఖ్యలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉండడమే ఇందుకు కారణం. దీంతో ఈ ఎన్నికల తర్వాత మండలిలో వైఎస్సార్‌సీపీ రెండో పెద్ద పార్టీగా అవతరించనుంది. పెద్దల సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడోకంటికి తెలీకుండా హైదరాబాద్ వచ్చి వెళ్లిన ప్రియాంకా గాంధీ..!