Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈనాడులో శ్రీధర్ కార్టూన్ల‌కు సెల‌వు... త‌దుప‌రి ప‌య‌నం ఎటో!

Advertiesment
ఈనాడులో శ్రీధర్ కార్టూన్ల‌కు సెల‌వు... త‌దుప‌రి ప‌య‌నం ఎటో!
విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:58 IST)
ప్ర‌ముఖ పొలిటికల్ కార్టూనిస్టు  శ్రీధర్ ‘ఈనాడు’ నుంచి నిష్క్ర‌మించారు. నాలుగు దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానం పూర్తి చేసిన ఆయ‌న ఈనాడుకు రాజీనామా చేశారు. శ్రీధర్ ఈనాడులో పాకెట్ కార్టూన్లు గీయడం మొదలుపెట్ట‌డం, ప‌త్రిక‌కు మంచి గుర్తింపు తెచ్చింది.  
 
ప్ర‌తిభ‌ను ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని, త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డం, తీర్చిదిద్ద‌డం, ఈనాడు అధినేత రామోజీరావుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. అందులో భాగంగా త‌యారైన ఓ ఆణిముత్య‌మే శ్రీధ‌ర్. 
 
అస‌లు, ఈనాడులో శ్రీధ‌ర్ ప్ర‌స్థానం ప్రాసెసింగ్ సెక్ష‌న్ లో ఒక సాధార‌ణ కార్మికుడిగా ప్రారంభం అయింది. ప్రాసెస్ సెక్ష‌న్ల‌లో క‌ట్ట‌ర్ తో ఫిలిం క‌ట్ చేసి, ప్లేట్ మేకింగ్ కి పంపే ప‌నిలో చేరిన శ్రీధ‌ర్, ఒక‌సారి ఒక త‌ప్పు చేశాడు. అదే అత‌ని పాలిట వ‌రంగా, ఈనాడు ప‌త్రిక‌కు అద్వితీయ శ‌క్తిగా మారింది.

ఒక‌సారి శ్రీధ‌ర్ ప్రాసెస్ లో త‌న ప‌ని ప‌క్క‌న పెట్టి, కింద లైటింగ్ ఉండే అద్దంపై పేప‌ర్ మీద బొమ్మ‌లు గీస్తుండ‌టం, ప‌త్రికాధిప‌తి దృష్టికి వెళ్లింది. ప‌ని వేళ‌ల‌లో పిచ్చి గీత‌లు గీస్తూ, టైం వేస్ట్ చేస్తున్నాడ‌ని అత‌నిపై ప్రాసెసింగ్ ఇన్ ఛార్జి నుంచి కంప్ల‌యింట్ కూడా పైకి వెళ్లింది. ఆ స‌మ‌యంలో పిలిచి శ్రీధ‌ర్ కు చివాట్లు త‌గిలిస్తార‌ని అంతా భావించారు. అలాగే, శ్రీధ‌ర్ ను ప‌త్రికాధిప‌తి పిల‌వ‌డం జ‌రిగింది. కానీ, శ్రీధ‌ర్ కు అక్షిత‌లు వేయ‌డం కాదు... అత‌నిలోని ప్ర‌తిభ‌ను గుర్తించి, నీవు కార్టూన్లు వేస్తావా? అని ఈనాడు అప్ప‌టి ఛీఫ్ ఎడిట‌ర్ రామోజీరావు అడ‌గ‌డం శ్రీధ‌ర్ కెరీర్ ని ఒక మ‌లుపు తిప్పింది. సారీ సార్, ఇంకెపుడూ ప‌నివేళ‌ల‌లో బొమ్మ‌లు గీయ‌ను అని చెప్పుకుందాం అని వెళ్లిన శ్రీధ‌ర్ కు, రామోజీరావు నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్, పెద్ద‌గా ఏం అనిపించ‌లేదు. నేను కార్టూన్ లు వేయ‌గ‌ల‌నా? అయినా నా ఉద్యోగం నేను చేసుకుంటే బెట‌ర్ క‌దా...అని కూడా మ‌న‌సులో అనిపించింది. కానీ, రామోజీరావు అత‌నికి ధైర్యం చెప్పి, పొలిటిక‌ల్ కార్టూన్ అంటే ఏమిటో, జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల‌ను చూపి వివ‌రించి చెప్పారు. శ్రీధ‌ర్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి, అత‌నికి కార్టూన్ గీయ‌డంలో స్వ‌ల్ప ట్రైనింగ్ కూడా ఇప్పించిన ఘ‌న‌త రామోజీరావుకే ద‌క్కుతుంది. 
 
అందుకే, అప్ప‌టి నుంచి రామోజీరావు ద‌త్త‌పుత్రుడిలా శ్రీధ‌ర్ కార్టూన్ రంగంలో విజృంభించారు. ఈనాడు మొద‌టి పేజీలో పాకెట్ కార్టూన్, ఇదీ సంగ‌తితో ప్రారంభించి, ప్ర‌ధాన సంఘ‌ట‌న‌లు, రాజ‌కీయ ప‌రిణామాలు జ‌రిగిన‌పుడు ప‌తాక స్థాయిలో సెట‌యిరిక్ కార్టూన్లు వేయ‌డం వ‌ర‌కూ ప‌రిణితి చెందారు. 
 
కార్టూనిస్టు శ్రీధ‌ర్ త‌ను వేసే కార్టూనుల వెనుక ఎంతో కృషి, సాధ‌న‌కు తోడు మంచి పుస్త‌క ప‌రిజ్ణ్నానం కూడా ఉండేది. ఆయ‌న ఎపుడూ ఏదో ఒక పుస్త‌కం చ‌దువుతుండేవారు. అలాగే, ఎవ‌రు ఆయ‌న్ని క‌లిసినా, మీరు ఏం చ‌దువుతున్నారు అని అడ‌గ‌డం ప‌రిపాటి. చాలా సార్లు తన వద్ద ఉన్న పుస్తకాలు చదవడానికి ఎదుటి వాళ్ళ‌కు ఇచ్చేవాళ్లు కూడా. అవి ఎందుకు మంచి పుస్తకాలో, ఎందుకు చదవాలో చెప్పి మరీ ఇచ్చేవాళ్లు!
 
చాలా మంది ఆర్టిస్టులు మనం ఎదురుగా కూర్చుని ఉండగా, పెన్సిలుతో ఒక గీత కూడా గీయరు. గీయడం అనేది వారికి ఒక రహస్యం. చాటుమాటు వ్యవహారం అని వారనుకుంటారేమో. కానీ, శ్రీధర్ అలా కాదు. అంద‌రి ఎదుట, గంటల కొద్ది కూర్చుని కార్టూన్లు గీస్తుంటారు. త‌న కార్టూన్ ప్రింటింగ్ అయిన తర్వాత కూడా, దాన్ని ప‌రిశీలిస్తూ, ఈ స్ట్రోక్ లేకుంటే బాగుండేది. ఇది ఇంకా మార్చితే బాగుండేది అని మ‌థ‌న‌ప‌డే మ‌న‌స్త‌త్వం శ్రీధ‌ర్ ది. ఆయన ప్రపంచం కేవలం కార్టూన్లే కాదు. చిత్రకళ కూడా. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల పేర్లు అనేకం చెబుతూ, వారి గీతలో, కుంచెలో, ఎంచుకునే అంశంలో, తీర్చే శైలిలో, రంగుల మేళవింపులో, ఇలా ఆయా చిత్రాలకు సంబంధించి అనేకానేక కోణాల్లో అనేక మంది చిత్రకారుల్నిపోల్చి, విశ్లేషించే వారు శ్రీధ‌ర్.
 
పొలిటికల్ కార్టూనిస్టుగా శ్రీధర్ కు ఎన‌లేని పేరు వ‌చ్చింది. ఎంతో సెటైర్ గా వార్త‌లు, వ్యాసాలు రాసినా, వాటిని ఒక చిన్న కార్టూన్ తో అధిగ‌మించ‌డం, అంత‌కు మించి సెట‌యిర్, కార్టూన్ ద్వ‌రా వేయ‌డం శ్రీధ‌ర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌. 
 
ఈనాడుతో ఆయన అనుబంధం చాలా బలమైంది. కార్టూనిస్టుల ప్రపంచం కనీ వినీ ఎరుగనంత కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చినా శ్రీధర్ వాటిని తోసిపుచ్చి, ఈనాడుకే, త‌న‌కు ఉద్యోగ‌మిచ్చిన రామోజీరావుకే అంకిత‌మ‌య్యారు. పుత్ర వాత్స‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శించిన రామోజీరావుతో, 40 ఏళ్ళ‌పాటు ప్ర‌యాణించిన శ్రీధ‌ర్ ఎట్ట‌కేల‌కు ఆ సంస్థ‌కు రాజీనామా చేశారు. అంతటి బలమైన అనుబంధం ఇంత ముక్తసరిగా ముగుస్తుందని ఎవ్వరూ ఎన్నడూ ఊహించ లేరు. అయితే, తాను న‌మ్ముకున్న రామోజీరావే ఈనాడు ప‌త్రిక సంపాద‌కుడిగా ఇపుడు లేని స‌మ‌యంలో, శ్రీధ‌ర్ రాజీనామా పెద్ద విశేషం ఏమీ కాదు. సింపుల్ గా స‌ర్వీస్ అయిపోయింది....రిటైర్ అయిపోయా...అని చెప్పే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  
 
శ్రీధర్ కు ఈనాడులో కార్టూనింగ్ లో నలభయ్యేళ్ల  ప్రస్థానం మాత్రమే ముగిసింది. ఇప్పటి దాకా ఈయ‌న‌వి ‘ఈనాడు కార్టూన్లు’గా మాత్రమే మనకి తెలుసు. ఇక ‘శ్రీధర్’ గా ఆయన ప్రజ్ఞ బహుముఖంగా ముందుకు వెళ్లే అవ‌కాశాలు కూడా లేకపోలేదు.  
 
గ‌తంలో సోమాజీగూడ ఈనాడు ఆఫీసులో శ్రీధర్ టేబుల్‌పై అద్దం కింద, ఆయన చేతి రాతలోనే హిందీ వాక్యం ఉన్న కాగితం ముక్క ఉండేది. దానిపై ఇలా రాసుంది. 
 
‘‘వఖ్త్ ఫుర్సత్ హై కహా కామ్ అభీ బాకీ హై
నూరే తౌహీద్ కా ఇత్‌మామ్ అభీ బాకీ హై’’
 
విశ్రాంతి తీసుకోడానికి చాలినంత ఖాళీ సమయం లేదు. చేయవలసిన పని చాలా మిగిలే ఉంది. భగవంతుడి దీపం నీ స్పర్శను కోరుతోంది. నీ స్పర్శతో అది సూర్యుడు చిన్నబోయేలా చేస్తుంది! అని దాని అర్ధం. అలాగే, నలభయ్యేళ్ల ఈనాడు ప్రస్థానం ఇక్కడ ఆగింది. కానీ ఇది విశ్రాంతి కోసం తీసుకున్న విరామం కాదు. చేయవలసిన పని చాలా మిగిలుంది. ప్రపంచం మీ సృష్టి నుంచి చాలా చాలా కోరుకుంటోంది. అని గుర్తెరిగితే, శ్రీధ‌ర్ మ‌ళ్లీ కొత్త రూపాల్లో విజృంభించ‌గ‌ల‌రు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు