తిరుపతిలో పోలీసులే కబ్జాదారులు - రెండు కోట్ల స్థలం హాంఫట్...
కాపలా ఉండాల్సిన పోలీసులే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన పోలీసు ఉన్నతాధికారులు తిరుపతి నగరంలో కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారంటే నమ్ముతారా. ఇది నిజం.
కాపలా ఉండాల్సిన పోలీసులే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన పోలీసు ఉన్నతాధికారులు తిరుపతి నగరంలో కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారంటే నమ్ముతారా. ఇది నిజం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా కొన్నేయళ్ళుగా ఒకటిన్నర ఎకరా స్థలాన్ని ఆక్రమించుకుని వారి అవసరాలకు వాడుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న రెవిన్యూ అధికారులను బెదిరిస్తూ విషయాన్ని దాటవేస్తున్నారు.
ఆధ్మాత్మిక నగరం తిరుపతి రోజురోజుకూ కబ్జా కోరల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే రూ.వేల కోట్లు విలువ చేసే స్వామివారి భూములను కబ్జా చేసి ఎంజాయ్ చేస్తుంటే.. మరోవైపు పోలీసులు కూడా తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు భూముల అక్రమాలకు దిగుతున్నారు. తిరుపతి నడిబొడ్డున రెండుకోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్నికొన్నేళ్ళుగా పోలీసులు తమ అవసరాలకు వాడుకుంటున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు.
న్యూ బాలాజీ కాలనీలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్, యూత్ హాస్టల్‌కు మధ్యలో ఒకటిన్నర ఎకరా స్థలం ఉంది. నిజానికి ఇది ప్రభుత్వ స్థలం. ఈ స్థలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కలుపుతూ రోడ్లు వేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అలా వేయాలని అధికారులు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని బెదిరించారు. అంతేకాకుండా ఆ స్థలాన్ని పెరేడ్ గ్రౌండ్‌తో పాటు కలిపి ప్రహరీ గోడను కూడా నిర్మించి విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు.
రెవిన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెండు మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో అడ్డుపడుతున్నారు. స్థలాన్ని తామే వాడుకుంటామని ఏం చేసుకుంటారో.. చేసుకోపొమ్మంటూ అడగడానికి వచ్చిన ఎమ్మార్వోను ఓ డిఎస్పీ స్వయంగా బెదిరించాడన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే ఈ కబ్జా గురించి పోలీసు శాఖలో ఉన్న కొంతమందికి మాత్రమే తెలుసా.. లేక అందరికి ఇందులో భాగస్వామ్యం ఉందా? అనే విషయం తేలాల్సి ఉంది. దీనిపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వ స్థలాన్ని పోలీసు కబ్జా నుంచి కాపాడాలని తిరుపతికి చెందిన ఒక సంఘ సేవకుడు మాగంటి గోపాల్ రెడ్డి కోరుకుంటున్నాడు. ఇప్పటికే స్థల కబ్జాపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రహోంశాఖామంత్రికి లేఖలు రాసినట్లు మాగంటి గోపాల్ రెడ్డి చెప్పారు.