తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామచంద్రాపురం సమీపంలోని పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.గంగవరం గ్రామంలోని రామాలయంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థనలు జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
దీనిపై జిల్లా వ్యాప్తంగా దుమారం రేగడంతో విషయం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా ఎస్పీ రవీంథ్రనాథ్ బాబు క్లారిటీ ఇచ్చారు. గంగవరం గ్రామంలో కాదా మంగాయమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.
అదే రోడ్డుకి ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని ఈ విషయంలో స్థానిక హిందువులకు, క్రిస్టియన్లకు కలసిమెలసి ఉంటున్నారని, ఎటువంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీనిపై గ్రామంలో విచారణ జరిపిన పోలీసులు అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అసత్య ప్రచారం నమ్మొద్దని తెలిపారు.