Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2021 నాటికి పోలవరం పూర్తి: మంత్రి అనిల్‌కుమార్‌

2021 నాటికి పోలవరం పూర్తి: మంత్రి అనిల్‌కుమార్‌
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (07:59 IST)
పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అధికారులకు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 28న సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయనున్న నేపథ్యంలో విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు, సహాయ, పునరావాస శాఖ కమిషనర్‌ బాబూరావు తదితరులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేలో 43 బ్లాకుల్లో పియర్స్‌ పనులు ఊపందుకున్నాయని సీఈ సుధాకర్‌బాబు వివరించారు. ఒక్కో పియర్‌ను 55 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని, ఒక పియర్‌లో ఒక మీటర్‌ ఎత్తు పనులు చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు.

రోజుకు 1,500 క్యూబిక్‌ మీటర్ల చొప్పున స్పిల్‌ వేలో కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని, జూన్‌ నాటికి స్పిల్‌ వేలో మొత్తం 2.05 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను పూర్తి చేస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద నాలుగు టీఎంసీల మేర వరద జలాలు నిల్వ ఉన్నాయని, వాటిని ఖాళీ చేసే పనులు వేగవంతం చేశామని తెలిపారు. జూలైలో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించి, గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు.

రోజువారీ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేసి, వాటిలో పొందుపర్చాలని మంత్రి అనిల్‌కుమార్‌ ఆదేశించారు. జూన్‌లోగా 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలన్నారు.  

పోలవరానికి రూ.1,400 కోట్లు : పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,400 కోట్లను రీయింబర్స్‌ చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ పంపిన ప్రతిపాదనలను  కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఆమోదించారు.

తక్షణమే నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటిపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తే బహిరంగ మార్కెట్లో ఈ–ఆక్షన్‌ ద్వారా నాబార్డు నిధులు సేకరిస్తుంది.

ఆ నిధులను జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ, పీపీఏ ద్వారా ప్రభుత్వానికి అందజేయనుంది. పోలవరానికి ఇటీవల కేంద్రం రూ.1,850 కోట్ల మేర రీయింబర్స్‌ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి ఖర్చు చేసిన నిధుల్లో.. మిగిలిన రూ.3,283 కోట్లను రీయింబర్స్‌ చేసి, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని ఇటీవల ప్రధానితో సమావేశమైనప్పుడు సీఎం జగన్‌ కోరారు.

కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆదేశాల మేరకు.. ఇటీవల పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఆర్థిక సమస్యలు లేకుండా చూడాలని కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు!