ప్రేమను నిరాకరించిందనే కారణంతో బీ ఫార్మసీ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలో బీ ఫార్మసీ విద్యార్థిని మైథిలిప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. మాట్లాడాలని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు నిఖిల్, మృతురాలు మైథిలి ప్రియ రాపూరు మండలం చుట్టుపాలెం, స్వాతి బి ఫార్మసీ కాలేజీలో ఇద్దరు క్లాస్ మెట్స్ అని తెలుస్తోంది. బెంగళూరులో జాబ్ చేస్తున్న మృతురాలు మైధిలి ప్రియ.. సెప్టెంబర్ 6 పుట్టినరోజు కావడంతో.. మూడో తేదీ నెల్లూరుకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా ఈ విషయం తెలిసి- మాట్లాడాలి అని రూమ్ కి రమ్మంటు నిఖిల్ మైథిలికి ఫోన్ చేశాడు. రూమ్‌కి వెళ్లిన తర్వాత మైథిలిని నిఖిల్ కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మైథిలి ప్రియ చెల్లిని రప్పించి హంతకుడు చెప్పాడని పోలీసులు తెలిపారు.
మైథిలిప్రియను నిఖిల్ చాలాకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.