తమ పార్టీ అధినే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే బీజేపీ నేతలకు వైకాపా నేతలు కూడా ధీటుగా సమాధానం చెబుతున్నారు. బీజేపీ నేతలు ఒకటి అంటే మేం రెండు అంటాం అని ప్రకటించారు. ముఖ్యంగా, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డంగా బలిసిన నడ్డా.. లిక్కర్ స్కాం అంటున్నావు... బీజేపీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో బెల్టు షాపుల్లో స్కాంల్లో నీ వాటా ఎంత, బీజేపీ వాటా ఎంత? అంటూ నిలదీశారు.
టీడీపీ హయాంలో జరిగిన ఇసుక స్కాం రూ.4 వేల కోట్లలో నీ వాటా ఎంతో, బీజేపీ వాటా ఎంతో చెప్పు. ఇసుక లారీ రూ.30 వేలకు అమ్ముకుని పెద్ద పెద్ద పడవల్లాంటి కార్లలో తిరిగారు కదా.. చీకట్లో నీ వాటా ఎంతో చెప్పు.. అమరావతి కోసం నిధులిస్తే చంద్రబాబు హల్వా తిన్నట్లు తినేశాడని నువ్వేగా ఆరోజు ఆరోపించావు. ఈరోజెందుకు అమరావతికి మద్దతు పలుకుతున్నావు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రైవేటీకరణ పేరుతో విశాఖపట్టణం స్టీలు ప్లాంట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలనుకోవడమే పెద్ద భూస్కాం కాదా అని నిలదీశారు. రూ.వేలాది కోట్ల భూములను అదానీ, వేదాంత వంటి సంస్థలకు అప్పగించేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరమైనా ఎవరికైనా దారాదత్తం చేశామా? అమరావతి పాపాలకు బీజేపీ కారణం కాదా? 2014-19 మధ్యకాలంలో జరిగిన రూ.4,000 కోట్ల ఇసుక కుంభకోణం డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లింది? చంద్రబాబు సీఎంగా ఉన్న సమయలో ఢిల్లీ రికమెండేషన్ పేరుతో మూడు, నాలుగు కంపెనీలకే 80 శాతం లిక్కర్ అమ్మకాలను కట్టబెట్టారు. ఈ స్కామ్ ఎవరిది? అంటూ నిలదీశారు.
కర్ణాటకలో 40 శాతం పర్సంటేజీలతో అవినీతికి పాల్పడినందుకు బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. నాలుగేళ్లలో పేదలకు జగన్ రూ.2.16 లక్షల కోట్లు అందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇందులో సగమైనా ఇచ్చారా? అమరావతి పెద్ద ల్యాండ్ స్కామ్ అన్నది. బీజేపీయే కదా... ఇప్పుడెందుకు స్వరం మారింది? బీజేపీ కాస్తా టీజేపీగా మారిందని ఆరోపించారు.