Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబు గెలవాలంటే నేతల సాయం.. జగన్ గెలవాలంటే జనం కావాలి.. పేర్ని నాని

perni nani

ఠాగూర్

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (15:40 IST)
తమ పార్టీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంపై వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవాలంటే నేతల సాయం కావాలని, కానీ, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే జనం కావాలని అన్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
తమ స్వార్ధ రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్‌ల జగన్‌కు అవసరం లేదన్నారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం కానీ అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలన్నారు. పార్టీ ఫిరాయించిన వారికి 2029 ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ది చెబుతారని అన్నారు. వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చి వారికి పదవులు కట్టబెట్టారన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్ చేశారు.
 
కేవలం జగన్ మూలంగా ఒక మత్స్యకారుడు పెద్దల సభలో అడుగుపెట్టగలిగాడని నాని గుర్తుచేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు.. వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అతి పెద్ద ఆషాడభూతి అని అన్నారు. నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. చంద్రబాబును చూస్తుంటే జాలేస్తుందని అన్నారు.
 
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కు చెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేసిన తర్వాత రావాలని చెబుతున్న చంద్రబాబు.. గతంలో 23 మంది ఎమ్మెల్యేతో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇటీవల కూడా విజయవాడ, విశాఖ కార్పోరేషన్ల నుండి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడుకు చేరుకున్న ముంబై నటి జైత్వానీ కాదంబరి