Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు : పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు!!

Advertiesment
fire accident

వరుణ్

, మంగళవారం, 23 జులై 2024 (17:17 IST)
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కుట్ర కోణంపై ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైకాపా నేత మాధవ్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరగడానికి 10 రోజుల ముందు నుంచి క్రమం తప్పకుండా మాధవ రెడ్డి.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లినట్టు గుర్తించారు. ఫైల్స్‌ దహనం కేసులో అతని హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిరోజుల పాటు వరుసగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఏయే దస్త్రాలకు సంబంధించి ఎవరెవరిని కలిశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 
 
కాగా, అగ్నిప్రమాదం జరిగిన ఈ సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రమాదం వెనుక కుట్ర దాగివున్నట్టు చెప్పిన విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సోమవారం ఆయన సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. పోలీసు అధికారులతో రెండు గంటల పాటు చర్చించారు. ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించాక డీజీపీ మీడియాతో మాట్లాడారు. 
 
'ఆదివారం రాత్రి 11.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అన్ని కోణాల్లో పరిశీలించాక అది యాక్సిడెంట్‌ కాదు, ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం. 22ఏ భూముల దస్త్రాలతో పాటు పలు కీలక పత్రాలున్న గదిలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఇది అనుమానాలకు తావిస్తోంద'ని వివరించారు. 'ఈ ఘటన సమాచారం ఆర్డీవో హరిప్రసాద్‌కు తెలిసినా కలెక్టర్‌కు, ఎస్పీకి సమాచారమివ్వలేదు. ఘటన గురించి తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 
 
రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్‌ సర్య్కూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని ఎస్పీడీసీఎల్‌ అధికారులు నివేదిక ఇచ్చారు. అక్కడ వోల్టేజీ తేడాలకు అవకాశమే లేదని తేలింది. ఫోరెన్సిక్‌ నిపుణులూ ఇదే విషయం చెబుతున్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను పెంచుతున్నాయి' అని డీజీపీ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2026 నాటికి హ్యూమనాయిడ్ రోబోల ఉత్పత్తి- ఎలెన్ మస్క్