జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇందుకోసం ఆయన తలపెట్టిన రైతు భరోసా యాత్రను మంగవారం నుంచి ప్రారంభిస్తారు.
ఈ పర్యటన కోసం పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి జిల్లాలో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను పరిశీలిస్తే,
తొలుత మండల కేంద్రమైన కొత్త చెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం చేస్తారు. అక్కడ నుంచి 10.30 గంటలకు బయలుదేరి ధర్మవరం చేరుకుంటారు. అక్కమ మరో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారు.
ఆ తర్వాత 11.20 గంటలకు ధర్మవరం నుంచి ధర్మవరం రూరల్‌లోని గొట్లూరు గ్రామానికి పయనం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆర్థికసాయం అందజేస్తారు. అక్కడి నుంచి 12.10 గంటలకు బయల్దేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి రాక. 20 రోజుల కింద ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబానికి ఓదార్పు.. ఆర్థికసాయ చెక్కును ఇస్తారు.
చివరగా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరిక. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలురైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత. అదేగ్రామంలో రచ్చబండ గ్రామసభ కార్యక్రమం నిర్వహణ. మరికొందరు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత. ఆ తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరుతారు.