ఏపీలోని కడప జిల్లా పులివెందులలో 30 యేళ్ళ తర్వాత తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశామని స్థానిక ఓటర్లు చెబుతుంటే అక్కడ పరిస్థితు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం వెల్లడైన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులు సాధించిన విజయం ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో విజయం సాధించిన లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డిలకు ఆయన అభినందనలు తెలిపారు.
వైకాపా హయాంలో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదన్నారు. నామినేషన్ వేద్దామనుకున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడి వారిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇపుడు ఏకగ్రీవాలకు వెసులుబాటు ఉన్నప్పటికీ కానీ ఏకపక్షంగా ఎన్నికలు సాగినపుడు ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు రాకపోవచ్చన్నారు. పులివెందులలో పోటీ ఉండటం వల్లే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ తీర్పును వెల్లడించారన్నారు. ఇప్పటివరకు ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకుంటా వచ్చారని, ఇపుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీకి ఆస్కారం కలిగిందని ఆయన వెల్లడించారు.