సహనం మెండుంగా ఉండాలి : పవన్ కళ్యాణ్
నిజ జీవితంలో ఏదైనా సాధించడానికి చాలా సహనం కావాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు రోజుల లండన్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడి తెలుగు విద్యార్థులతో సమావేశమయ
నిజ జీవితంలో ఏదైనా సాధించడానికి చాలా సహనం కావాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు రోజుల లండన్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడి తెలుగు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... నిజ జీవితం అంటే సినిమాల్లోలా ఉండదని, సినిమాల్లో వెంట వెంటనే ఏదైనా అయిపోతుందని వ్యాఖ్యానించారు.
కానీ నిజజీవితంలో అలా కాదని, చాలా సమయం పడుతుందన్నారు. భారత్‌లో కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశంపై పవన్ మాట్లాడుతూ... రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వచ్చిన రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అవి అవసరం లేని పరిస్థితి వస్తే బాగుండేదన్నారు.
సమానత్వం వచ్చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ మార్పు వస్తోందని, అప్పట్లో వెనకబడిన కులం అని చెప్పుకునేందుకు నామూషీగా భావించేవారని, కానీ ఇప్పుడు ఆ భావన తొలిగిపోతోందని తెలిపారు.
భారత్‌లో ప్రజాస్వామ్యం ఉండటం ప్లస్ పాయింట్ అని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ, స్వేచ్ఛ ముసుగులో ఇష్టం వచ్చినట్లు పౌరులు ప్రవర్తించవద్దని సలహా ఇచ్చారు. దేశం కోసం మన వైపు నుంచి మనం ఏం చేయగలమని ప్రశ్నించుకోవాలని ఆయన విద్యార్థులకూ సూచించారు.