జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు చిక్కులు మొదలయ్యాయి. వారాహి విజయ యాత్రలో భాగంగా, ఆదివారం గురువారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ, ఏపీలో కనిపించకుండా పోయిన మహిళల వెనుక రాష్ట్రంలోని వలంటీర్లే కారణమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అలాగే, అనంతపురంలోని ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో కొంతమంది వలంటీర్లు పవన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్.. ప్యాకేజీ స్టార్ డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.
కాగా, ఆదివారం ఏలూరులో సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల వెనుక వలంటీర్లు ఉన్నారని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్ చేయడం, బయటకు తీసుకెళ్ళడం, మాయం చేయడం ఇదే వలంటీర్ల పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని అన్నారు. వలంటీర్లపై ఆయన విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందంటూ విమర్శించారు. మహిళల మిస్సింగ్ గురించి ఆయనకు ఏ అధికారి చెప్పారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్కేసులు లేవా అని నిలదీస్తూ, జనసేనానికి మహిళా కమిషన్ నోటీసులు జారీచేశారు.