Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన పేరు వింటే వైసీపీ గజగజా వణుకుతోంది: పవన్ కళ్యాణ్

Advertiesment
జనసేన పేరు వింటే వైసీపీ గజగజా వణుకుతోంది: పవన్ కళ్యాణ్
, శనివారం, 2 అక్టోబరు 2021 (22:31 IST)
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు తథ్యమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, జనసేన పేరు వింటేనే ప్రభుత్వం భయంతో గజగజా వణికిపోతోంది అన్నారు. లక్ష మందితో జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుని... 4 వేలకు పైగా వాహనాలను నిలిపివేశారు... జనసేనను చూసి ప్రభుత్వం ఎంత భయపడుతోందో ఇదే నిదర్శనమని అన్నారు.

గుంతలు లేని రోడ్డు రాష్ట్రంలో ఒక్కటైనా ఉందా? దీనిపై మాట్లాడితే వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారన్నారు. రాజకీయాలు అంటే తనకు సరదా కాదని, బాధ్యత అని, తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని, తాట తీసి నారతీస్తానని హెచ్చరించారు. శనివారం రాజమండ్రి హుకుంపేట వద్ద జనసేన పార్టీ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఎ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
 
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "ప్రజాస్వామ్యంలో పనులు జరగనప్పుడు, విధానపరమైన తప్పిదాలు జరిగినప్పుడు, రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కులు నెరవేర్చలేనప్పుడు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఎత్తి చూపడం మన హక్కు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కదా ఏ ప్రభుత్వం ఆపలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అడ్డుకోలేరన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకోవాలి.

పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని, వారిపై ఒత్తిడులు తీసుకువచ్చి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను తొక్కేయాలని చూడకండి. మీరు తొక్కే కొద్దీ లేస్తాం తప్ప మేము లొంగం. పోలీస్ శాఖ వారి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మీరు బారికేడ్లు వేసినా, లాఠీ ఛార్జులు చేసినా, నన్ను ఆపినా మిమ్మల్ని నేను అర్ధం చేసుకోగలను ఆ తప్పు మీది కాదు. మిమ్మల్ని నడిపే ప్రభుత్వానిది.

బూతులు తిడితే భయపడి పారిపోను
రాజకీయాలను నేను మిగతా నాయకుల్లా వ్యాపార ధోరణిలో చూడను. ఒక బాధ్యతగా మాత్రమే భావిస్తా. సరదాగా సినిమా నటుడ్ని అయిపోయాను కదా.. కొనసాగింపుగా రాజకీయ నాయకుడ్ని అయిపోదామని నేను రాలేదు. అసలు సినిమా నటుడ్ని అవుదామనే నేను అనుకోలేదు. 16 ఏళ్ల వయసు నుంచి సామాజిక సమస్యలు చూస్తు ఎదిగాను.

రాజకీయం చాలా కష్టమైన ప్రక్రియ. తెల్లబట్టలు వేసుకుని చేతులు ఊపేస్తే అధికారం వచ్చేస్తుందని కలలు కనే వ్యక్తిని కాదు. ఒడిదుడుకులన్నీ తట్టుకుంటూ ముందుకు వెళ్లాలన్న లోతైన ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. వేల కోట్లు ఉండి మన హక్కుల్ని కాలరాసే ముఠాల మధ్య ఒక రాజకీయ పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం ముందుకు వచ్చేముందు అన్నీ ఆలోచించే వచ్చాను. 

టీవీలలో బూతులు తిట్టినంత మాత్రాన భయపడి పారిపోను. పవన్ కళ్యాణ్ గా నిలబడడం కోసం ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలుసు. నా ఒక్కడి లబ్ది కోసం పార్టీ స్థాపించలేదు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో అధికారం కొంత మంది చేతుల్లోకి వెళ్లిపోయి మిగతా వారికి సమస్థితిలో న్యాయం జరగలేదన్న వేదన నుంచి జనసేన పార్టీ పుట్టింది. కులాల ఐక్యత అని మాట్లాడే ముందే లోతుగా ఆలోచించాను. కుల, మత, వర్గరహిత సమాజం మన ఆకాంక్ష. ఒక కులాన్ని ద్వేషించి బద్ద శత్రువుగా ప్రకటించి మరో రెండు కులాలను కలుపుకొని రాజకీయం చేద్దామన్న ఆలోచనలు నేటి వ్యవస్థలో పుట్టుకొచ్చాయి.
 
26 కిలో మీటర్ల రోడ్డు కూడా సాఫీగా లేదు
రోడ్ల మీదకు వచ్చి శ్రమదానం చేయడం నాకు సరదా కాదు ఒక బాధ్యత. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు మనం టాక్సుల రూపంలో కట్టే డబ్బంతా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. దాన్ని అధికారంలో ఉన్న వారు బాధ్యతగా ఖర్చుపెట్టాలి. కానీ ఓటుకు రెండు వేలు ఇచ్చి మౌలిక వసతుల్ని పట్టించుకోకపోతే ఎలా?

రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26 వేల కిలోమీటర్ల రహదారులు ఉంటే., అందులో 26 వేల కిలోమీటర్లు కాదు కదా కనీసం 26 కిలో మీటర్లు కూడా సాఫీగా ప్రయాణం సాగే పరిస్థితి లేదు. రాష్ట్రంలో గుంతా బొంతాలేని రోడ్లు ఎక్కడా కనబడడం లేదు. 
మహాత్ముని స్ఫూర్తితో గాంధీ జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మహాత్ముడు మన కోసం శ్రమించారు. బలిదానం చేశారు. గాంధీ జయంతి రోజు దండవేసి సరిపెట్టడం కాదు ఆయన స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని మీతో పంచుకోవడానికే ఈ రోజును ఎంచుకున్నాను.

నా మంచితనాన్ని పిరికితనంగా భావించొద్దు
నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నారు. . యాక్షన్, కెమెరా, కట్ చెప్పి వెళ్లిపోతానని. నేను అలా వెళ్లే వాడినో కాదు మీ పార్టీలో అందరికంటే మీకే బాగా తెలుసు. మీకు తెలిసినంత మీ నాయకుడికి కూడా తెలియకపోవచ్చు. లక్షా 26 వేల కిలోమీటర్ల రోడ్లలో 26 వేల కిలోమీటర్ల రహదారులు సైతం గుంతలు పూడ్చలేని స్థితిలో మీరున్నారు. నేను వస్తున్నానని తెలిసి ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డు రాత్రికి రాత్రి వేస్తారు.

పుట్టపర్తికి వస్తున్నామంటే రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయిగానీ మాట్లాడే వారు లేరు కాబట్టి పనులు చేయడం లేదు. అందుకే నేను అందర్నీ ప్రశ్నించమని మొత్తుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో పాలించేవాడికి ప్రశ్నించేవాడంటే భయం. ఒక కార్యక్రమాన్ని నేను రాజకీయ లబ్ది కోసం పెట్టను. వైసీపీకి గానీ, ఇంకో పార్టీకి గానీ సలాం కొట్టి ఉంటే బూతులు తిట్టకుండా నన్ను గుండెల్లో పెట్టుకునే వారు.

ప్రజల కోసమే నేను తిట్లు తింటున్నా. నేను నా కోసం బతికేవాడినే అయితే నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా.  నన్ను తిట్టడం అనే ప్రక్రియ ఈ రోజు మొదలయ్యింది కాదు. నేను ఎన్నో మానసిక అత్యాచారాలుకు ఓర్చుకున్నా. ఇక మీదట పడేది లేదు. నా మంచితనాన్ని, సహనాన్ని పిరికితనంగా భావించవద్దు.

జనసైనికులు చేసి చూపారు
రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఒక సందర్భంలో ప్రముఖ రాజకీయవేత్త, మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశా. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. నేను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఆయనకు వివరించా. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఆయన సూచనల మేరకు పోటీ చేసి 20 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్తే అధికారంలో ఉన్నవారు ఊరుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తింది.

అప్పుడు ఆయన అన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి. నీ వెనుక ఇంత మంది జనసైనికులు, వీర మహిళలు ఉండగా అలా వెళ్లిపోయే ధైర్యం ఎవరికైనా వస్తుందా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రావిపాడు ఎంపీటీసీ విషయంలో ఆ మాటను జనసైనికులు నిజం చేసిన చూపారు.

గాజు గ్లాసు గుర్తు మీద బీఫామ్ తీసుకుని సదరు వ్యక్తి వైసీపీకి మద్దతు అని వెళ్లిపోతే, నువ్వు పార్టీ మారిపో మా సింబల్ గెలిపించుకుంటామని చెప్పి జనసైనికులు ఓట్లు వేశారు. పార్టీ గెలిచింది అభ్యర్ధి ఉన్నాడా లేడా అన్నది వారే ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో జనసేన పార్టీలోకి వచ్చే వారు కూడా ఆలోచించుకోండి. కనీసం రెండు దశాబ్దాలు జనసేన పార్టీతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రండి.

తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టనివ్వమన్నారు
తూర్పు గోదావరి జిల్లాలోకి వస్తుంటే.. జిల్లాలో ఎలా అడుగుపెడతారో చూద్దాం అని చాలా మంది బెట్టింగులు కాశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి చాలా మంది కార్యక్రమాన్ని చెడగొట్టాలని ప్రయత్నాలు చేశారు. ద్వారంపూడి లాంటి గొప్ప ఇంటిపేరుని ఆయన చెడగొట్టారు. నాపై జరిగిన మానసిక అత్యాచారాలకు ద్వారంపూడి కూడా ఒక ఉదాహరణ. నేను ఆయన్ని తిట్టలేదు. కవ్వించలేదు.

ఆయనకు ఆయనే చిన్న మీటింగు పెట్టుకుని పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పి పచ్చి బూతులు తిట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉండగా ఆ విషయం తెలిసింది. మన వాళ్లకు చాలా బాధగా ఉంది నిరసన తెలియచేస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. సరే అన్నాను. ఈలోపు మా వారి మీద దాడి చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నన్ను అకారణంగా తిట్టారు.

నేను మిమ్మల్ని ఒక్క మాట అన్నానా. ఎన్నికల్లో వాదోపవాదాలు మినహా ఏమన్నా అన్నానా? అయినా ఎందుకు తిట్టారంటే మీకున్న అహంకారం. ఏ మీరేమన్నా ఎగువ స్థాయిలో మేము దిగువస్థాయిలో పుట్టామా? నీకు నాకు ఉన్నది నాలుగు లీటర్ల రక్తమేగా. ఎందుకు మీకంత అహంకారం?

సహిస్తాం..భరిస్తాం.. శృతిమించితే ఊరుకోం
కులాల ఐక్యత గురించి నేను పదే పదే మాట్లాడుతా. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తా. ఆదరిస్తా. అలాగే ఏలూరులో ఒక రెల్లి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు కౌగలించుకుంటానని వస్తే నేను దగ్గరకు తీసుకున్నా. మనం ఏ కులంలో పుట్టాలన్న ఛాయిస్ మనకు లేదు. మనం ఎలా ప్రవర్తించాలన్నది మాత్రమే మన చేతుల్లో ఉంది. నిన్న రాత్రి జూమ్ మీటింగ్ లో  మా తండ్రి స్నేహితులు నెల్లూరు శేషారెడ్డి, నా స్నేహితుడు సొంతపేట సనత్ రెడ్డి, పొదలకూరు జయచంద్రారెడ్డిలతో మాట్లాడాను.

నన్ను ఎందుకు తిడుతున్నారు అని అడిగితే. అది కులం తప్పు కాదు అని నాకు స్పష్టత ఇచ్చారు. ఓ సామెత ఉంది తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అడ్డగోలుగా సంపాదించి ఒళ్లు బలిసి నోటికి వచ్చినట్టు వాగండి. ఏం వాగుతారో వాగండి? సహిస్తాం.. భరిస్తాం.. చివరికి మీ తాట తీస్తాం. ఇది సినిమా డైలాగ్ కాదు. భవిష్యత్తులో నేను చేయబోయేదే మీకు చెప్పాను.

నన్ను తిట్టండి.. జాతి ఏం చేసింది?
ఈ మధ్య ఒక మంత్రి ఆయన పేరు ప్రస్తావించదలుచుకోలేదు. నేను వచ్చిన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అంట.. అందువల్ల చనువు తీసుకుని నాతోపాటు నేను పుట్టిన కులాన్ని కూడా తిట్టేస్తున్నారు. నేను మిమ్మల్ని ఏమైనా అంటే నన్ను తిట్టండి జాతి ఏం చేసింది? అది తప్పు కాదా? మీలాంటి వారు మీరు పుట్టిన కులాని మీరే తగ్గించుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు పవన్ కళ్యాణ్ ని తిట్టరా.

మీరే తిట్టి.. మీరే గిల్లి.. ఎందుకు గిల్లారని అడిగితే మా వాళ్ల మీద దాడులు చేశారు. మా వీర మహిళలు అంతా వెళ్తే ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. మంత్రి గారు తిట్టిన దానికంటే పదింతలు తిట్టారు. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకుంటా. మా ఆడపడుచుల్ని అనకూడని మాటలు అన్నారు జాగ్రత్త.

వైసీపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది
మీకు నాకు మధ్య పాలసీ సమస్య ఉంది. రోడ్లు ఎందుకు వేయలేదని అడుగుతా. బడ్జెట్ లేదని చెప్పండి. అంతేగాని పచ్చి బూతులు తిడితే.. నేను నాకువచ్చిన నాలుగు భాషలతో పాటు అదనంగా భాషలు నేర్చుకుని మరీ తిట్టగలను. అలా తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే తిట్టం. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలి. సాధికారత రావాలని కోరుకునే వాడిని నేను. రాష్ట్రంలో పెత్తనం అంతా కేవలం రెండిళ్ల మధ్యలో జరుపుతానంటే కుదరదు. శెట్టిబలిజ సోదరులు ఉన్నారు. యాదవులు ఉన్నారు.

అత్యంత వెనుకబడిన వారు అన్నారు. మైనారిటీలు ఉన్నారు. వీరందరినీ పక్కన పెట్టి బిచ్చ వేస్తాం అంటే కుదరదు. అలాగే వైసీపీ కమ్మ సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా ప్రకటించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసింది. ఆ ఇద్దరు కొట్టుకుంటే మనకి రోడ్లు లేకుండా పోయాయి. రేషన్ షాపుల్లో బియ్యం రావు. చెత్త మీద టాక్సులు. నెలకి జీతాలు రావు, సమయానికి  ఫించన్లు ఇవ్వరు. ఒకటా రెండా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది.

2005 నుంచి నాపై దాడులు చేస్తూనే ఉన్నారు
 నా మీద దాడులు ఇప్పుడు మొదలు పెట్టినవి కాదు 2005 నుంచి చేస్తూనే ఉన్నారు. నేను సినిమాలు చేసుకుంటే మానసికంగా రకరకాల అత్యాచారాలు జరిపారు. నన్ను ఎవరో కొట్టారంట.. తిట్టారంట.. కిడ్నాప్ చేశారంట. ఒకటి కాదు. రెండు కాదు. ఎందుకు అలా చేశారు అంటే వాళ్లందరికీ ఆ రోజే అర్ధం అయ్యింది వీడు ఒక బలమైన వ్యక్తి... కష్టాలకు నిలబడే వ్యక్తి అని.

నా ప్రాణాలు వదిలేసి మీ ప్రాణాల కోసం పోరాటం చేస్తాను అని చెప్పటానికేని ఆ నాడు తుపాకీ ఇచ్చేశాను. వైసీపీ పాలన ఎంత దారుణంగా తయారయ్యిందంటే ఇక్కడ ఎవ్వరికీ హక్కులు లేవు. మాట్లాడే పరిస్థితులు లేవు. మాట్లాడితే కొడతారు. ఏంటీ అన్యాయం అంటే జైల్లో పెడతారు. దళితుల మీదే అట్రాసిటీ కేసులు పెడతారు.

ఈ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండాపోతోంది. పిఠాపురంలో ఉండే భైరవయ్య అనే కార్యకర్త దగ్గర నుంచి  దేశ ఉప రాష్ట్రపతి వరకు ఎవరినీ వీరు వదల్లేదు. గతంలో జర్మనీలో ఒక చర్చి ఫాదర్ హిట్లర్ ను వెనకేసుకొస్తే చివరికి ఆయన్ని కూడా అరెస్టు చేయించారు. మీరు ఇప్పుడు వైసీపీని వెనకేసుకొస్తే మీకు అదే గతి పడుతుంది.

బీజేపీ కార్యకర్తలనూ వదలడం లేదు
వైసీపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా వదలడం లేదు. కడప జిల్లాలో నలుగురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కడుపు చీల్చేశారు. పేగులు కూడా బయటికి వచ్చేశాయి. విజయనగరంలో కత్తులు బ్లేడ్లతో కోసేశారు. జనసైనికులను ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో చూస్తే బాధ కలుగుతుంది. కర్రలకు మేకులు కొట్టి దాడులు చేస్తున్నారు. మనం ప్రశ్నించామన్న అక్కసుతో ఇలా దాడులు చేస్తున్నారు.

ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఫ్యూడలిస్టిక్ పాలన అనుకుంటున్నారా? ఆ రోజులు పోయాయి. మెతక వ్యక్తులు ఉన్నపుడు అలాంటివి సాగేవి.. మీరు సై అంటే సై అనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్దతిలో మాట్లాడమంటే మాట్లాడుతాం. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే మాత్రం ఊరుకునే వ్యక్తిని కాదు. మీటింగులకి వచ్చి ఓట్లు మాత్రం వైసీపీకి వేశారు. వాళ్లు అధికారంలోకి వచ్చి యువతకు ఏం చేశారు. ఉద్యోగాలు ఇచ్చారా? నేను మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా.

రాష్ట్రం మొత్తం రోడ్లు వేయండి 
సజ్జల గారు మీరన్న మాటలు చాలా బాధించాయి. కెమెరా యాక్షన్ కట్ అని మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతానన్నారు. మీ నాయకుడు తాడేపల్లిలోనే ఉన్నారు కదా.. మరి అక్కడి నుంచి ఆయనెందుకు బయటకురారు. వచ్చి ఇలా మట్టిలో నడవమనండి. రోడ్లు చూడమని ఆయనకు చెప్పండి. నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా రోడ్ల మీదకు వస్తా. మీలాంటి వ్యక్తి అలా మాట్లాడడం బాగా లేదు.

మీరు అంత మానిటరింగ్ చేసి ప్రభుత్వ సలహాదారుగా చేసిందేంటి పోలీసులకు ఫోన్ చేసి మా కార్యక్రమాన్ని అడ్డుకోమని చెప్పడమా? మేము సమస్య గురించి మాత్రమే మాట్లాడుతాం మీరు సరిదిద్దండి. మీరు ధవళేశ్వరం రోడ్లు వేశారు. పుట్టపర్తి వేశారు. అలాగే రాష్ట్రం మొత్తం వేయండి మేము సంతోషిస్తాం.

వైసీపీ పాలనలో రెడ్లకూ తప్పని పాట్లు
పేనుకు పెత్తనం ఇస్తే రాత్రంతా కుళ్లబొడిచినట్టు వైసీపీకి పెత్తనం ఇస్తే మీరు ఆ కులం ఈ కులం అని చూడకుండా అన్ని కులాలను కుళ్లబొడుస్తున్నారు.  ఆ వర్గం ఈ వర్గం తేడా లేకుండా అన్ని వర్గాలను నలిపేస్తున్నారు. అందులో రెడ్డి సామాజికవర్గం కూడా ఉంది.  వారి చుట్టుపక్కల ఉండే వ్యక్తులకు మినహా ఎవ్వరికీ అవకాశాలు లేవు. ఈ వ్యవహారంలో రెడ్డి సామాజిక వర్గం కూడా బాధపడుతోంది.

నేను కోరుకుంటుంది పదవులు కాదు సామాజిక మార్పు. నాకు పదవి వస్తే సామాజిక మార్పు జరగాలి అప్పుడే పదవి తీసుకుంటా. అప్పటి వరకు పోరాటమే చేస్తా. వైసీపీ రైతు ఉద్యమం వ్యవహారంలో ద్వంద్వ వైఖరితో ఉంది. ఇక్కడ బంద్ అంటే రైతులకు మద్దతిస్తారు. పార్లమెంటులో మాత్రం మాట్లాడరు. మీ మాటలు ప్రజల్ని మభ్యపెట్టడానికేగా. మీ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. 
 
జనసేన గెలుపు ఖాయం
లక్ష మందితో జరగాల్సిన సభను అడ్డుకున్నారు. 4 వేలకుపైగా వాహనాలు రాజమండ్రి బయట నిలిపివేశారు. బైకుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. దీన్ని బట్టి జనసేన పార్టీ అంటే మీకు ఎంత భయమో అర్ధం అవుతుంది. నేను అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు రావాలని కంకణం కట్టుకుని వచ్చాను. ఇప్పటికే పాతుకుపోయిన రాజకీయ శక్తులు వీటి మధ్యలో ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.

ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక బేల్దార్ మేస్త్రి విజయం సాధించాడు. ఒక స్కూలు టీచర్ రూ. 2 వేలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యింది. రూ. 5 వేలతో ఒక తల్లి తన బిడ్డను ఇంటింటా తిప్పితే ఆ అబ్బాయి ఎంపీటీసీ అయ్యాడు. మార్పు ఎప్పుడూ చాలా చిన్నగా కనిపిస్తుంది. అదే మార్పు అంటే . ఈ మార్పు కోసమే తపిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగురవేయబోతోంది.

మీరు ముందుకొస్తేనే మార్పు సాధ్యం
ఈ రోజు కాపు, తెలగ, ఒంటరి, బలిజలకు ఒక మాట చెబుతున్న మీరు ముందుకు వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. మీరు మీ పెద్దలతో మాట్లాడండి. జరిగిన తప్పుల గురించి ఆలోచన చేయండి. మనం ఎవరి చేతుల్లో పడ్డాం. ఎవరికి లొంగిపోయామనేది ఆలోచించండి. కాపు, తెలుగ, ఒంటరి, బలిజ ముందుకు వస్తే తప్ప శెట్టిబలిజ సోదరులు బయటికి రాలేరు.

మీరు ముందుకు వస్తే తప్ప తూర్పు కాపులు బయటకు రాలేరు. మీరు ముందుకు వస్తే తప్ప కొప్పుల వెలమలు బయటకు రాలేరు. మీరు ముందుకు వస్తే తప్ప దళితులకు సాధికారత రాదు.. మీరు ముందుకొస్తే తప్ప మైనారిటీల అభివృద్ధి జరగదు. ఇంతటి బాధ్యత కాపు, తెలగ, ఒంటరి, బలిజలపై ఉంది. నాయకుడు బతికున్నప్పుడు అండగా ఉండడం కాదు చనిపోకుండా నిలబడాలి.

ఒక పొరపాటు జరిగింది. ఈసారి చెబుతా ఉన్నా... మీరు పెద్దన్న పాత్ర పోషించాలి. కాపులు, ఒంటరులు, తెలగ, బలిజలు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలి. శెట్టిబలిజ సోదరులు నలిగిపోతుంటే అండగా నిలబడాలి. ఏడు దశాబ్దాలుగా పోరాడుతున్న మీరు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.

యుద్ధం ఏ సైజులో కావాలో ఎంచుకోండి
 మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి రోజున మీరంతా ఏకమై అధికారం లేని వర్గాల కోసం బయటకు రావాలి. సమసమాజ స్థాపన కావాలి. ఈ సుదీర్ఘ యుద్ధంలో నా ప్రాణాలు పోతే దేశం నలుమూలలా పిడికెడు మట్టిని చల్లండి. ఆ మట్టితో ఈ నేల నుంచి అన్యాయాన్ని దాష్టికాన్ని ఎదిరించే కత్తులు మొలవాలి. వైసీపీ ...యుద్ధానికి సిద్ధమవ్వండి.  మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు .. ఏ సైజు యుద్ధం కావాలో ఎంచుకోండి" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5500 మెట్రిక్‌ టన్నుల ఇ-వ్యర్ధాలను ఆర్గానిక్‌గా సేకరించడం లక్ష్యంగా చేసుకున్న ఆర్‌ఎల్‌జీ