Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని రైతుల త్యాగాలు వృథాకానివ్వం : పవన్ కళ్యాణ్

రాజధాని రైతుల త్యాగాలు వృథాకానివ్వం : పవన్ కళ్యాణ్
, సోమవారం, 6 జులై 2020 (17:04 IST)
అమరావతి రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు చేస్తోన్న పోరాటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నిర్ణయించారు కాబట్టి రైతాంగం తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారని, వారి త్యాగాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా కానివ్వబోమన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
తమ పాలన వచ్చింది కాబట్టి రాజధానిని మార్చుకుంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రైతాంగాన్ని అవమానించడమేనని తమ పార్టీ మొదటి నుంచి చెబుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు రైతులు 200 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు.
 
బీజేపీతో కలిసి రైతులకు అండగా నిలబడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 29 వేల మంది రైతుల త్యాగాలను వృథా కానివ్వబోమని చెప్పారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదని చెప్పుకొచ్చారు.
 
అలాగే, సామాజిక వనాల అభివృద్ధే పరమావధిగా కోటికి పైగా మొక్కలు నాటి వనజీవిగా పేరొందిన దరిపెల్లి రామయ్య తనలాంటి వారెందరికో ఆదర్శప్రాయుడన్నారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా చెట్లు నాటుతూ, వనాలు పెంచుతున్న రామయ్యను పద్మశ్రీ పురస్కారం కూడా వెతుక్కుంటూ వచ్చిందని గుర్తుచేశారు. 
 
అంతటి మహనీయుడు వనజీవి రామయ్య ఓ వీడియోలో తన గురించి చెప్పిన మాటలు తనలో ఎంతో బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు. ఆయన మాటలను శిరోధార్యంగా భావిస్తానని అన్నారు. మొక్కలపై ఆయనకున్న మమకారం ఎనలేనిదని, చివరికి తన నలుగురు మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లే పెట్టుకుని వనజీవి అనే బిరుదును సార్థకం చేసుకున్నారని పవన్ కీర్తించారు. 
 
రామయ్యకు దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నామని, డొక్కా సీతమ్మ పేరిట ఆహార శిబిరాలు నిర్వహించిన విధంగానే, వనజీవి రామయ్య పేరు మీద పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తామని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రికార్డు : ఒకే రోజు 1322 కేసులు