Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ : తెనాలి వారాహి యాత్ర రద్దు!

Pawan Kalyan

ఠాగూర్

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (13:13 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు మండుటెండలో ప్రచారం చేశారు. ఎండ తీవ్రత కారణంగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. పైగా, రెండు మూడు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ పిఠాపురంలో మాత్రం తన షెడ్యూల్ ప్రకారం పర్యటన పూర్తి చేశారు. ఈ పర్యటన పూర్తయిన తర్వాత బుధవారం నుంచి తెనాలిలో వారాహి యాత్ర చేయాల్సివుంది. అయితే, జ్వరం తీవ్రత అధికం కావడంతో ఆయన తన యాత్రను రద్దు చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన తెనాలి నుంచి హైదరాబాద్ నగరానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. బుధవారం తెనాలితో పాటు, గురువారం నెల్లమర్లలో జరగాల్సిన పర్యటను కూడా వాయిదాపడింది. 
 
వైకాపాకు అంటకాగే ఐపీఎస్‌లపై ఈసీ కొరఢా... ఆరుగురు ఎస్పీలపై వేటు!! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు అంటకాగుతున్న ఐపీఎస్, ఐఏఎస్‌లపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐఏఎస్‌లపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ముంగిట ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వీరిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకుంది. 
 
బదిలీ వేటు పడిన ఐపీఎస్‌ అధికారుల్లో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, గుంటూరు రేంజి ఐజీ పాలరాజు, కృష్ణా జిల్లా రిటర్నింగ్ అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమి, తిరుపతి జిల్లా రిటర్నింగ్ అధికారి లక్ష్మీషాలకు స్థానచలనం కలిగించింది. 
 
అయితే, వీరిపై ఈసీ చర్యలు తీసుకోవడానికి గతంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులే ప్రధాన కారణంగా ఉంది. ఇటీవల చిలకలూరి పేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడ హాజరైన బహిరంగ సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అలాగే, ఓటర్ల జాబితా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించారని, వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో ఈసీ వీరిపై కొరఢా ఝళిపించింది.
 
అనంతపురం ఎస్పీ అన్బురాజన్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమి... వీరిరువురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఉరవకొండ ఓటర్ల జాబితాలో అక్రమాలపై పట్టించుకోలేదని కలెక్టర్ గౌతమిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గతంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి కలెక్టర్ గౌతమి బంధువు అని టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఇక, అనంతపురం ఎస్పీ అన్బురాజన్ గతంలో వివేకా కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టరుపైనే అక్రమ కేసు పెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎస్పీ అన్బురాజన్ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. పైగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్కెట్ చూపించమన్న టీటీఈ... రైలు నుంచి కిందికి తోసేసిన ప్రయాణికుడు!!