అన్నయ్య చిరంజీవి తాను రెండేళ్ళపాటు మాట్లాడుకోలేదనీ, ఆ సమయంలో తమ మధ్య మాటలు కలిపింది నాదెండ్ల మనోహర్ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే నాదెండ్ల మనోహర్ అంటే తనకు అమితమైన ఇష్టమన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనను అన్నయ్య చిరంజీవిని కలిపింది నాదెండ్ల మనోహరేనంటూ చెప్పుకొచ్చారు. అందుకే తనకు నాదెండ్ల మనోహర్ అంటే అంత గౌరవమన్నారు. తాను గౌరవించే కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరంటూ చెప్పుకొచ్చారు. నాదెండ్ల మనోహర్ ని గెలిపించాలని కోరారు.
నాదెండ్ల గెలుపుకోసం జనసేన పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ నేతల్లాగా తాము భూ కబ్జా చేసేవాళ్లం కాదన్నారు. ప్రజా సేవ చేసేందుకే తాను రాజీకాయల్లోకి వచ్చానన్నారు. రెండేళ్లు జైల్లో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తాడా అంటూ వైఎస్ జగన్ పై కామెంట్స్ చేశారు.
జగన్ చుట్టు ఉన్నవారిలో నేరస్థులెక్కువ అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఒక సూచన చేశారు. ఏపీ రాజకీయాల్లోకి రావొద్దని కేసీఆర్‌కు పవన్ విజ్ఞప్తి చేశారు.
జనసేన పార్టీ కులాల ఐక్యత కోసం పాటుపడే పార్టీ అని చెప్పుకొచ్చారు. కులాల మధ్య చిచ్చుపెడితే సహించేది లేదన్నారు. రాజకీయ నేతకు కులం, మతం అనే తేడా ఉండకూడదన్నారు. ప్రజారాజ్యం పార్టీతో వ్యవస్థలో మార్పు వస్తుందని తాను భావించానని చెప్పుకొచ్చారు.
నాయకుడు మంచివాడైతే సరిపోదని పక్కన ఉండేవాళ్లు కూడా మంచి నేతలై ఉండాలని అభిప్రాయపడ్డారు. తాను ఎంత మెత్తగా ఉంటానో ప్రజల జోలికి వస్తే అంతే కఠినంగా ఉంటానని హెచ్చరించారు.