ఏదైనో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు మన పెద్దలు. ఈ సామెతను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాగా ఒంటబట్టించుకున్నట్టున్నారు. ఎందుకంటే.. తాను పోటీ చేసిన ఓడిపోయిన భీమవరం నుంచే ఆయన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఓటమి తర్వాత తొలిసారిగా భీమవరానికి పవన్ కళ్యాణ్ ఆదివారం తొలిసారి వెళ్లారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం, భవిష్యత్‌లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోంది, ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారనే విషయమై ఈ సమవేశంలో చర్చించనున్నట్టుగా ఆయన తెలిపారు.
రాజకీయాలు హుందాగా ఉండాలని తమ పార్టీ కోరుకొంటుందని ఆయన తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడ అలాగే వ్యవహరిస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. వరద బాధితులను ఆదుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.