చమన్ కుమారుడు ఉమర్‌ను ఎంబీబీఎస్ చదివిస్తా : సీఎం చంద్రబాబు హామీ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి ప్రధాన అనుచరుడు అనంతపురం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి ప్రధాన అనుచరుడు అనంతపురం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు చమన్ మొదటి భార్య రమీజాబీకి ఆయన హామీ ఇచ్చారు.
చమన్ గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. పరిటాల రవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చమన్ మృతిపట్ల పరిటాల అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో చమన్ భార్య రమేజాబీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. చమన్ కుటుంబానికి అండగా ఉంటామని, చమన్ చిరకాలవాంఛ అయిన ఆయన కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇదిలావుండగా, చమన్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన రామగిరి మండలం ఆర్. కొత్తపల్లిలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. రామగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో గల చమన్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు.
ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, అంత్యక్రియలకు పరిటాల రవి కుటుంబసభ్యులతో పాటు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.