Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా టీకాలు వేరేవాళ్లకు వేస్తున్నారు, మాకు వేస్తారా లేదా? రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

Advertiesment
Our vaccines are being given to others
, శనివారం, 8 మే 2021 (12:44 IST)
తమకు వేయాల్సిన వ్యాక్సిన్‌ను కొందరు సిబ్బంది పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని, బయటి ప్రాంతాల వారికి వేస్తున్నారని మార్టూరు మండలం జొన్నతాళి వాసులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సచివాలయంలో రెండో డోసు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానికులూ పెద్ద సంఖ్యలో వచ్చారు.

53 మందికి మాత్రమే టీకా వేసి ఆపేయడంతో మిగతావారు ఆందోళనకు దిగారు. ఇక్కడ తొలివిడతగా 101 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో డోసు కోసం ఏడు వయల్స్‌ కేటాయించారు. ఒక్కోటి 13 మందికి చొప్పున 91 మందికి ఇచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా... వచ్చిన వయల్స్‌ (సీసాలు)లో మూడు అప్పటికే వినియోగించి ఉన్నాయి. విషయం గుర్తించిన గ్రామస్థులు సిబ్బందిని నిలదీశారు.

వెంటనే తహసీల్దార్‌, సంబందిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన వారు తొమ్మిది వాహనాల్లో టీకాల కోసం గ్రామానికి రావడాన్ని ప్రశ్నించారు. ఇక్కడ వ్యాక్సిన్‌ ఇస్తారన్న సమాచారం మాకే సరిగా తెలియదని... వారికి ఎలా తెలిసిందని నిలదీశారు. కొందరు సిబ్బందే టీకాలను పక్కదోవ పట్టించి... ప్రైవేటు ఆసుపత్రులకు, వ్యక్తులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో చాలామంది... గుంటూరు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట పాంతాల్లో ఉంటున్నారని... వారు తమ బంధువులు, సన్నిహితులకు మాత్రమే ఇక్కడ టీకా ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని... స్థానికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయాన్ని ద్రోణాదుల వైద్యాధి కారిణి డాక్టర్‌ కవితా అనసూయ దృష్టికి తీసుకువెళ్లగా... తాను ఇసుకదర్శిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి సరిపడా వ్యాక్సిన్‌ రాలేదన్నారు. వచ్చిన వయల్స్‌లో మూడు వాడి ఉండడంపై విచారణ చేపడతామన్నారు.
 
యద్దనపూడి మండలం తనుబొద్దివారిపాలెంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శనివారం అక్కడ రెండో డోసు వేసేందుకు శిబిరం నిర్వహించగా... గుంటూరు జిల్లా చిలకలూరిపేట, పసుమర్రు పరిసర ప్రాంతాల వారు ప్రత్యేక వాహనాల్లో వచ్చి టీకా వేయించుకున్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధితో పాటు మరికొందరికి టీకా లేదని సిబ్బంది చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలపడంతో... సిబ్బంది వెంటనే రెండు వైల్స్‌ను తెప్పించి మిగిలిన వారికి టీకా వేశారు. బయట అమ్ముకునేందుకే కొందరు సిబ్బంది ఈ వయల్స్‌ను దాచి పెట్టారని స్థానికులు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విలేజ్ వాలంటీర్లను వాడుకోండి, కరోనాను కట్టడి చేయండి, ఎవరు?