అమ్మాయి ఫోటో కనబడితే చాలు... లైకులు, షేర్లతో హోరెత్తించే పెద్ద మనుషులు మామూలు విషయమే, అయినప్పటికీ... అమ్మాయి ఫోటో చూసి వాళ్లడిగినంత డబ్బులు ఇచ్చేసే పెద్ద మనుషులు మోసాలకు గురవుతున్నారు.
వివరాలలోకి వెళ్తే... తనను తాను ఓ అమ్మాయినని పేర్కొంటూ, ఫోటోలు అడిగితే సోదరి వరసయ్యే.. అమ్మాయి ఫోటోలు పంపుతూ... సాటి ఉద్యోగిని దారుణంగా మోసం చేసిన ఓ ఐటీ ఉద్యోగికి సంబంధించిన ఘటన హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది.
సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల మేరకు, నెల్లూరుకు చెందిన శివమాధవ్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్గా పని చేస్తూ... డేటింగ్ వెబ్‌సైట్లలో గత మూడేళ్లుగా తానో అమ్మాయినని ప్రొఫైల్స్ పెడ్తూ, తన వలలో పడ్డవారిని మోసం చేస్తూ ఉన్నాడు. తనపై ఆసక్తి చూపిన వారితో అమ్మాయిలా మాట్లాడేవాడు. తనకు చెల్లెలు వరసైన అమ్మాయి ఫోటో తనదిగా చూపించి మోసం చేసి డబ్బు గుంజడం అతనికి పరిపాటిగా మారిపోయింది.
ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న అభినవ్ అనే యువకుడికి శివమాధవ్ ఫేక్ ప్రొఫైల్ నేమ్ మేఘన కనిపించగా, పరిచయం పెంచుకున్నాడు. ఫోటో పంపాలని అడుగగా, తన అలవాటు ప్రకారం సోదరి వరసైన అమ్మాయి ఫోటో పంపాడు. ఆపై తన తండ్రికి బాగాలేదంటూ చెప్పి ఖాతాలో డబ్బులు వేయించుకున్నాడు. కలుద్దామని కోరితే, వాలెంటైన్స్ డే నాటికి నెల్లూరుకు రావాలని చెప్పి, అడ్రస్ ఇచ్చాడు. అక్కడ తన తల్లిదండ్రులకు ముందే చెప్పి, తాను ఇంట్లో లేనని అబద్ధం చెప్పించి, ముందే చూపిన ఫోటోను మరోసారి చూపించేలా చేసాడు.
మార్చిలో పెళ్లి పెట్టుకుందామని మోసం చేస్తూ, పెళ్లి ఖర్చులకు రూ. 10 లక్షలు కావాలని అడిగించాడు. దీన్ని నమ్మిన అభినవ్ ఆ డబ్బు ఇచ్చాడు. ఆపై ఎంత ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాకపోవడంతో అభినవ్ పోలీసులను ఆశ్రయించాడు. శివమాధవ్ ఇలా మొత్తం రూ. 45 లక్షలు కాజేశాడని తేల్చిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసారు. హార్మోన్ల లోపం కారణంగా అతని గొంతు అమ్మాయి మాట్లాడినట్టుగా ఉంటుందని, అతను స్వలింగ సంపర్కుడనీ, నాలుగేళ్ల క్రితం వివాహం జరుగగా, భార్య వదిలేసి వెళ్లిందని పోలీసులు తేల్చారు.