టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుది అవినీతివంతమైన పాలన అంటూ ఎద్దేవా చేశారు. పైగా, ప్రస్తుతం సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం నీతివంతమైన పాలన అందిస్తోందన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత తెదేపా పాలనలో రూ.ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో నిరుద్యోగులకు చంద్రబాబు ఏమీ చేయలేదు. వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
రైతుల సంక్షేమానికి సీఎం జగన్ పాటుపడుతున్నారు. సీఎం జగన్ నిజాయితీ పాలనను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. 40 యేళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గత ఐదేళ్లలో ఏం చేయలేదు. కమీషన్ల కోసం ప్రజాధనాన్ని బాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
సోషల్ మీడియా ట్విట్టర్‌లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబుదేనని, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం వైపు వైఎస్.జగన్ అడుగులు వేస్తున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.