Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త ప్రభుత్వం కక్ష సాధింపులు ఉండవు... తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలి : చంద్రబాబు

Chandrababu

వరుణ్

, గురువారం, 13 జూన్ 2024 (11:57 IST)
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపులు ఉండవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అదేసమయంలో ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నతంగా ఉండాలన్నదే తన ఆశయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పును ఇచ్చారని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు... శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామన్నారు. గురువారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 
 
ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్‌ మైన్స్‌ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. శ్రీ వేంకటేశ్వరస్వామే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగుజాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని.. కోరుకుంటానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ మనకు పెద్ద సంపదని.. ఎనర్జీని రీఛార్జ్‌ చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే భాగస్వాములు ఉంటారని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 
 
1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేది. ఆ తర్వాత ప్రక్షాళన చేశాం. సరికొత్త పాలన ప్రారంభించాం. వెంకన్న ఆశీస్సులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం. సంపద సృష్టించాలి.. దాన్ని పేదలకు పంచాలి. గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారు. వారిపై అపారమైన గౌరవం ఉంది.. రుణపడి ఉన్నా. ఐదు కోట్ల మందికి ప్రతినిధి. రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా ప్రతినిధులు క్షోభ అనుభవించారు. పరదాలు, చెట్లు కొట్టడంలాంటివి ఇకపై ఉండవు. నేరస్థులను సహించేది లేదు. తిరుమలలో గంజాయి, మద్యం, విచ్చలవిడిగా మార్చారు. శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు. 
 
అదేసమయంలో నవ్యాంధ్రలో ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను పునరుద్ధరించాలి. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి. వాటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. టిటిడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు వెల్లడించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా బ్రదర్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడారు?