Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోచుకోవడానికేనా ప్రైవేట్ పర్మిట్లు : అశ్వత్థామరెడ్డి ప్రశ్న

దోచుకోవడానికేనా ప్రైవేట్ పర్మిట్లు : అశ్వత్థామరెడ్డి ప్రశ్న
, ఆదివారం, 3 నవంబరు 2019 (15:28 IST)
ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన తెలంగాణ సర్కారు వారిని బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి తెస్తోందనీ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. 
 
మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ శనివారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని, కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదని అన్నారు.
 
ఆర్టీసీలోనూ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటు పరమైతే వెనకబడిన కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికులను కేసీఆర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 5100 రూట్లకు అనుమతులు ఇస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ డిమాండ్లను కేసీఆర్ అంగీకరిస్తే యూనియన్లు ఉండవని తెలిపారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. టీఎస్‌ఆర్‌టీసీ ఆస్తులను, సంపదను కొల్లగొట్టే దోపిడీ వ్యూహంలో భాగమే ప్రభుత్వం చేసిన ప్రైవేటీకరణ సూత్రమన్నారు. 
 
ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీకి, ఇప్పుడు చేసిన ప్రకటనకు పొంతనలేదని ధ్వజమెత్తారు. సమ్మె కారణంగా రోజుకి కోటి మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదంతా ప్రభుత్వ నిర్వాకం పుణ్యమేనన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాభైవేల మంది కార్మిక కుటుంబాల పొట్టకొట్టేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
 
సమ్మె సమస్యను పరిష్కరించాల్సింది పోయి కార్మికులను బెదిరించడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం కేసీఆర్‌ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. తమది పారదర్శక ప్రభుత్వమని కేసీఆర్‌ చెప్పుకుంటున్నప్పుడు కార్మికులతో నేరుగా చర్చలు జరపడానికి సమస్య ఏమిటన్నారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులు, ప్రభుత్వ బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయక పోవడంలోనే ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయతీ : కేసీఆర్‌కు చిక్కులు తప్పవా?