ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్ జిల్లాల ప్రయాణానికి అనుమతినిచ్చారు. ఇందుకోసం కారు కోసం ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని, అయితే, కారులో ముగ్గురుకు మించి ప్రయాణించడానికి వీల్లేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.
జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపే విషయమై ఎస్పీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో డీజీపీ గౌతం సవాంగ్ మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులు జిల్లాల సరిహద్దు దాటి ప్రయాణికులను తరలిస్తున్నందున వ్యక్తిగత వాహనాలకు అనుమతులు ఎందుకనే ప్రశ్నలు వస్తున్న విషయాన్ని ఉటంకించారు.
జిల్లాల మధ్య ప్రయాణించే వారికి ప్రత్యేక పాస్‌లు తీసేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు మినహా ఎక్కడా వాహనాలకు పాస్‌లు అడగవద్దని ఆదేశించారు. కారులో ముగ్గురికి మించి ప్రయాణించకూడదని, పోలీసులు ఎక్కడ వాహనాన్ని అపినా అందులో ప్రయాణికులందరికీ మాస్క్‌లు ఉండి తీరాల్సిందేనని డీజీపీ స్పష్టం చేశారు.