ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనరు తొలగింపునకు సంబంధించిన అన్ని జీవోలను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అదేసమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నియమిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
నిమ్మగడ్డ తొలగింపు విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తున్నట్లు శుక్రవారం తీర్పును వెలువరించింది.
అంతేగాక, ఈ విషయంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టివేసినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. ఎస్ఈసీగా రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్డినెన్స్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను తొలగించే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసిన విషయంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరపున వాదించిన పలువురు న్యాయవాదులు స్పందించారు. ఈ క్షణం నుంచే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని చెప్పారు.
ఎన్నికల అధికారిగా ఇకపై కనగరాజ్ కొనసాగడానికి వీల్లేదని వారు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రద్దయిన నేపథ్యంలో నిమ్మగడ్డ ఏపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నట్లేనని ఆయన చెప్పారు. ఇకనైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని న్యాయవాది ప్రసాద్ బాబు అన్నారు.
అధికారంలోకి వచ్చిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఇన్ని విమర్శలు ఎదురవుతున్నాయని, ఇకపై ఆయినా తీరు మార్చుకుని తదుపరి నాలుగేళ్లు సమర్థవంతంగా పాలన అందించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారాలకు సంబంధించి ఇదో చారిత్రక తీర్పని న్యాయవాదులు అంటున్నారు. రమేశ్ కుమార్ కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు.