ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడుగా వ్యాపిస్తోంది. ఈ కారణంగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అదేసమయంలో కరోనా మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
కరోనా కట్టడి చర్యలపై మంగళవారం సీఎం నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల రద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్లకు సెలవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అంతేకాకుండా.. దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మార్కెట్లు, దుకాణాల విషయంలో నిర్ణీత సమయం తెరిచి ఉంచేలా ఆంక్షలు పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రేపు మధ్యాహ్నం లోపు క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరోవైపు, ఏపీలో కరోనా కేసులు పెరగడంపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతోంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని విమర్శంచారు.
అదే వస్తుంది.. అదే పోతుంది అనే ధోరణిలో జగన్ ఉన్నారన్నారు. బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, కనీసం సరిగా భోజనం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వ్యాక్సిన్ కొరతపై టీడీపీ తరుపున ప్రధానికి, కేంద్రానికి లేఖ రాస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.