ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అయింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ అందించాలని ఆదేశించారు. అర్హుల జాబితాను సిద్ధం చేసి సంక్రాంతి నాటికి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సివున్నందున కలెక్టరంతా ఉధృతంగా పని చేయాలని సూచించారు.
పేదలకు స్థలాల పంపిణీ అందరికీ ఇష్టమైన కార్యక్రమం కావాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతుందన్నారు. కలెక్టర్ల దగ్గర రూ.కోటి చొప్పున ప్రత్యేక నిధి ఉంచినా ఎందుకలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
స్పందన కార్యక్రమం అమలుపై సీఎం మంగళవారం (డిసెంబర్ 31, 2019) సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్షించారు. ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కొనసాగుతుందని తెలిపారు.
దిశ చట్టం అమలుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి నెలను దిశ మాసంగా భావించి, పని చేయాలని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రానికి 2020 చరిత్రాత్మక సంవత్సరం కావాలన్నారు.