Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త ఎయిర్‌పోర్టుల కోసం తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పోటీ

హైద‌రాబాద్ : ప‌్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సంగ‌తెలా ఉన్నా... తెలుగు రాష్ట్రాలు మాత్రం హైటెక్ హంగుల కోసం గాల్లో తేలుతున్నాయి. కొత్త ఎయిర్‌పోర్టులు మాకు కావాలంటే, మాకే కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ మొదలైంది. పారిశ్రామికంగా, పర్యాటక రంగంలోను

కొత్త ఎయిర్‌పోర్టుల కోసం తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పోటీ
, సోమవారం, 24 అక్టోబరు 2016 (12:52 IST)
హైద‌రాబాద్ : ప‌్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సంగ‌తెలా ఉన్నా... తెలుగు రాష్ట్రాలు మాత్రం హైటెక్ హంగుల కోసం గాల్లో తేలుతున్నాయి. కొత్త ఎయిర్‌పోర్టులు మాకు కావాలంటే, మాకే కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ మొదలైంది. పారిశ్రామికంగా, పర్యాటక రంగంలోను అభివృద్ధి సాధించేందుకు విమానాశ్రాయాల ఏర్పాటు ముఖ్యమని అటు చంద్ర‌బాబు, ఇటు కేసీఆర్ గ్రహించారు. దాంతో ఇటు ఏపిలోనూ అటు తెలంగాణాలోనూ ఎంత ఎక్కువ విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకుంటే అంత ఉపయోగమ‌ని ముఖ్యమంత్రులు పోటీ ప‌డుతున్నారు. ఇపుడున్న విమానాశ్రయాలకు తోడు కొత్తగా మరికొన్ని ఏర్పాటుకు రెండు రాష్ట్రాల్లోనూ కార్యాచ‌ర‌ణ మొదలయింది. ఏపిలో కొత్తగా 12 విమానాశ్రయాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా,  ఇటు సీఎం కేసీఆర్ కూడా అంత‌కు మించి 14 విమానాశ్రయాల ఏర్పాటుకు డిమాండు చేస్తున్నారు.
 
రాష్ట్రంలో కొత్తగా 14 చోట్ల విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.  కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలు లభిస్తున్నాయి. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యంతోనే కేంద్రం ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఇటీవలే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. 
 
ఉడాన్ ద్వారా తెలంగాణాలో కొత్తగా కొన్ని విమానాశ్రయాలను ఏర్పాటు చేయటమే కాకుండా ఎప్పటి నుండో నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాలకు కూడా కొత్త రూపును ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా కేంద్రానికి ప్రతిపాదనలను అందచేసింది. వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, దుండిగల్, నాదర్ గుల్, హకీంపేట, నాగార్జునసాగర్, నల్గొండ, ఆలేరు, సిర్పూర్ కాగజ్ నగర్, కొత్తగూడెం, జక్రాన్ పల్లి, జహీరాబాద్ ప్రాంతాల్లో విమానాశ్రయాలతో పాటు హెలికాప్టర్ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.
 
కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాన్ని పూర్తి స్ధాయిలో రాష్ట్రం ఉపయోగించుకుంటే పర్యాటక, పారిశ్రామిక రంగాలు బాగా అభివృద్ధి చెందుతాయని సిఎం కేసీయార్ భావిస్తున్నారు. తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాద్రి, బాసర, త్వరలో రూపుదిద్దుకోనున్న యాదాద్రిలకు విమాన, హెలికాప్టర్ యానంలో ప్రాధాన్యత కల్పించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పారిశ్రామికంగా త్వరలో ఎదగటానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో 13 వేల ఎకరాల్లో డ్రైపోర్టును ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 
 
డ్రైపోర్టు ఏర్పాటు, అభివృద్ధికి రూ. 43 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నది. ఎలాగు దీని కోసం పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వస్తారు కాబట్టి, ఇక్కడ కూడా ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లు అన్నీ సాగితే సమీప భవిష్యత్తులోనే 31 జిల్లాల రాష్ట్రంలో 14 కొత్త విమానాశ్రయాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా వీధుల్లో హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం.. ట్రంప్ అనుచరుల పనేనా?