అక్టోబరు 31న జాతీయ సమైక్యతా దినోత్సవం... కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ
అమరావతి : సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఎక్తా దివాస్) నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున రా
అమరావతి : సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఎక్తా దివాస్) నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యతా పరుగు, పోలీసుల మార్చ్ ఫాస్ట్, జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. తమతమ కార్యాలయాల్లో ఆ రోజు ఉదయం 11 గంటలకు సమైక్యతా ప్రతిజ్ఞ చేయాలని సచివాలయంలోని అన్ని శాఖల కార్యాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు సమైక్యతా పరుగు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, విజయవాడ, విశాఖ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ల సమన్వయంతో సమైక్యతా పరుగు నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. అలాగే జిల్లా కలెక్టర్ల సహకారంతో అదే రోజు సాయంత్రం 5 గంటలకు అన్ని జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ప్రధాన రోడ్డు కూడళ్లలో మార్చిఫాస్ట్ నిర్వహించడానికి డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రోడ్లపైన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మార్చ్ ఫాస్ట్ చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పోలీస్, కేంద్ర ఆర్మీ పోలీస్ బలగాలు రాష్ట్ర రాజధానిలోనూ, ఇతర ముఖ్య నగరాల్లోనూ సమైక్యతా పరుగు నిర్వహించడానికి డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖలు, జిల్లా అధికారులు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఈ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయాలని తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో ఆ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించి, ఉదయం 11 గంటలకు జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించడానికి పరిపాలనా శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని ఆ ప్రకటనలో సీఎస్ ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిజ్ఞ
‘‘దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్ధార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటునందిస్తానని సత్య నిష్టతో తీర్మానం చేస్తున్నాను.’’