ఇటు చూస్తే ఫిరాయింపు మంత్రులు.. అటు చూస్తే చంద్రబాబు.. అడకత్తెరలో పవన్.. ఏం మాట్లాడాలి?
రాజకీయాల్లో నీతి, నిజాయితీలను కోరుకునే పవన్ కల్యాణ్‌కు నిజంగానే ఇప్పుడొక చిక్కు వచ్చి పడింది. ఈ విషయంపై మాట్లాడినా మాట్లాడకపోయినా పవన్ అసలు వ్యక్తిత్వం ఏమిటో బయట పడే క్షణాలు వచ్చేశాయి. టీటీడీపీ నుంచి
పరిశుద్ధ రాజకీయాలు, నీతి, నిజాయితీ గురించి బోల్డ్ మాటలు మాట్లాడే పవన్ కల్యాణ్ ఈ విషయంలో మాత్రం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మామంచి మిత్రుడే అని చెప్పాలి. రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో తాను తన హృదయంలోంచే మాట్లాడుతున్నంత అభిప్రాయాన్ని జనాల్లో కలిగించడంలో సినీహీరో, జనసేనాధిపతి పవన్‌ను మించినవారు లేరు. ఇంతవరకు రాజకీయ కల్మషం, బురద అంటని పవన్ ఆ మాటలంటున్నప్పుడు జనం సాదరంగానే స్వీకరిస్తున్నారు కూడా.
రాజకీయాల్లో నీతి, నిజాయితీలను కోరుకునే పవన్ కల్యాణ్‌కు నిజంగానే ఇప్పుడొక చిక్కు వచ్చి పడింది. ఈ విషయంపై మాట్లాడినా మాట్లాడకపోయినా పవన్ అసలు వ్యక్తిత్వం ఏమిటో బయట పడే క్షణాలు వచ్చేశాయి. టీటీడీపీ నుంచి జంప్ చేసి టీఆరెస్ పార్టీలో ఏకంగా మంత్రి అయిపోయిన తలసాని యాదవ్‌పట్ల అప్పట్లో టీడీపీ వర్గాలు యుద్ధమే ప్రకటించాయి. ఒక పచ్చి ఫిరాయింపుదారు మంత్రి ఎలా అవుతారు అంటూ టీడీపీ వర్గాలు ఆక్రోశించాయి. టీడీపీ పెద్దన్న చంద్రబాబు అయితే ఆగ్రహంతో రగిలిపోయారు. టీటీడీపీ నేతలను ఢిల్లీ వీధులవరకు తరిమి తలసాని యాదవ్ మంత్రిపదవి ఊడపెరుకుతారా లేదా అనేంతగా వీరంగమాడేశారు.
కానీ అదే చంద్రబాబు ఇప్పుడు చేసిందేమిటి? ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా నలుగురు ఫిరాయింపుదార్లను మంత్రులను చేసేశారు. వాళ్లంతా వైకాపాకు చెందినవారు. ఫిరాయింపుదారులను మీరెలా మంత్రివర్గంలోకి తీసుకుంటారు బాబూ అంటూ తలసాని ఇప్పటికే టీడీపీ రాజకీయాలను దుయ్యబట్టారు. తాను తెరాసలో చేరి మంత్రి అయినప్పడు టీడీపీ ఎంత రాద్దాంతం చేసిందో తలసాని ఇప్పటికీ మర్చిపోలేదు మరి.
కానీ రాజకీయాల్లో స్వచ్చత గురించి, నీతి గురించి చంద్రబాబుతో సమానంగా నీతులు వల్లించే పవన్ కల్యాణ్ ఇంతవరకు ఈ ఫిరాయింపు మంత్రుల గురించి నోరిప్పలేదు. చంద్రబాబు చర్యను పవన్ ఆమోదిస్తున్నారా లేక తిరస్కరిస్తున్నారా అనేది తెలీడం లేదు. ఈ విషయంపై ఒక రాజకీయ సంస్థ అధిపతిగా జనసేన అధ్యక్షుడిగా తన అభిప్రాయం చెప్పితీరవలసిన బాధ్యత, విధి పవన్ కల్యాణ్‌పై ఉందని జనం భావిస్తున్నారు.
ఈ విషయంలో ఏం చెప్పాలంటూ పవన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇటేమో తన ఆప్తమిత్రుడు చంద్రబాబు.. అటేమో ఫిరాయింపు మంత్రుల్లో చిరుదరహాసాలు. జనం అన్నీ చూస్తున్నారు పవన్ ఏం చెబుతారు. మళ్లీ కట్టె విరగని, పాము చావని రీతిలో నాలుగు మాటలు గొణిగి మళ్లీ షూటింగుల్లో పడిపోతారా..
గతానుభవాలు అలాగే ఉన్నాయి మరి. అందుకే సిద్ధాంతాల గురించి వల్లెవేయడం చాలా సులువు. నిజజీవితంలో వాటిని అమలు పర్చడం పూర్తి విభిన్నమైన విషయం. ఈరోజు కాకపోయినా రేపైనా పవన్ ఈ నిజాన్ని తెలుసుకుంటారు. గ్రహిస్తారు మరి.
ఏపీ కేబినెట్‌లో ఫిరాయింపు మంత్రుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడకపోతే వై కట్టప్పా కిల్డ్ బాహుబలి కాదు.. మరో ప్రశ్న జనాలకు వస్తుంది. తప్పదు.