Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దవాడ్ని చెబుతున్నా.. స్పీకర్లిద్దరూ కలిసి పనిచేయండయ్యా!

పెద్దవాడ్ని చెబుతున్నా.. స్పీకర్లిద్దరూ కలిసి పనిచేయండయ్యా!
, శనివారం, 16 ఆగస్టు 2014 (10:32 IST)
పెద్దవాడ్ని చెబుతున్నా.. స్పీకర్లిద్దరూ కలిసి పనిచేయండయ్యా! అన్నారు గవర్నర్ నరసింహన్. స్పీకర్లు ఇద్దరూ తనకు రెండు కళ్ల వంటివారని, రెండు కళ్లూ పనిచేస్తేనే దృష్టి బాగుంటుదని నరసింహన్ అన్నారు.
 
మీరిద్దరూ కలిసి పనిచేయాలని నా కోరిక, పెద్దవాడిని చెబుతున్నా, వినండి అని ఆయన రెండు రాష్ట్రాల స్పీకర్లకు హితబోధ చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ‘ఎట్‌ హోం' అల్పాహార విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు శివప్రసాదరావు, మధుసూధనాచారి హాజరయ్యారు.
 
తిరిగి వెళ్ళే సమయంలో గవర్నర్‌ ఇద్దరి వద్దకు వచ్చి ఇద్దరి చేతులు పట్టుకొని మాట్లాడారు. అసెంబ్లీలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య భవనాలు, గదులు, క్వార్టర్లు పంచుకోవడంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. 
 
ఇరు రాష్ట్రాల మధ్య భవనాల పంపిణీపై ఈ ఏడాది మే 30న గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వు అమలు కాలేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గవర్నర్‌ వారిద్దరినీ అనునయించే ప్రయత్నం చేశారు. 
 
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెలను ఈ విషయంలో పెద్దరికం తీసుకోవాలని గవర్నర్‌ సూచించారు. ‘తెలంగాణ స్పీకరూ, మీరూ పాత పరిచయస్తులే. కలిసి పనిచేసినవారే. మీరు అనుభవజ్ఞులు. పెద్ద మనిషిగా బాధ్యత తీసుకొని ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోండి. మీమీద నాకు నమ్మకం ఉంది' అని నరసింహన్‌ అన్నారు.
 
ఈ ఇద్దరు స్పీకర్లు గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. దానిని దృష్టిలో ఉంచుకొని గవర్నర్‌ ఈ మాట అన్నట్లు అనిపిస్తోంది. తామిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకొంటున్నామని గవర్నర్‌తో కోడెల అన్నారు. ‘ఈ రోజు కూడా మేమిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకొన్నాం.
 
ఇంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు కలుసుకొన్నాం. మాలో ఎవరికీ సమస్యలు పెంచే ఉద్దేశం లేదు. మాలో మేం మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొంటున్నాం. అసెంబ్లీ వరకూ పెద్దగా సమస్యలు రాకపోవచ్చు' అని కోడెల శివప్రసాద రావు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu