పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తు అంటోన్న ప్రభుత్వ పెద్దలు, బతికుంటేనే భవిష్యత్తు అనేది కూడా గుర్తుంచుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటారో, ప్రాణాలతో చెలగాటమాడేలా పరీక్షలు పెట్టి కంసుడు అనిపించుకుంటారో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తేల్చుకోవాలన్నారు.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వున్న నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వివిధరంగాల నిపుణులతో సోమవారం ఆన్‌లైన్(జూమ్)లో టౌన్‌హాల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలో 24 గంటల్లో 3 లక్షల 50 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.
ఇవి 10 రెట్లు పెరిగే అవకావం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. కరోనా సునామీలా విరుచుకుపడుతోందని మన ప్రధాని మోదీ గారే రాష్ట్రాలను అప్రమత్తం చేయడం పరిస్థితి తీవ్రతని తెలియజేస్తోందన్నారు.
ఏపీలో 24 గంటల్లో 12,634 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయని, 20 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయన్నారు. మన ఆరోగ్య, పరిశ్రమల శాఖల మంత్రులు మాట్లాడుతూ ఏపీలో ఆక్సిజన్ కొరత లేదని ప్రకటించిన మరుసటిరోజే విజయనగరం మహారాజా ఆస్పత్రి ఐసీయూలో ఐదుగురు ఆక్సిజన్ కొరతతో చనిపోయారని దీనిపై మంత్రులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
రాజమండ్రి, గుంటూరు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, కరోనా పేషెంట్లకు ఆస్పత్రిలో బెడ్డు దొరకడంలేదు, కోవిడ్‌తో చనిపోయిన వారికి అంత్యక్రియలకు శ్మశానంలో స్థలం కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశమంతా ఏ పరిస్థితులున్నాయో ఏపీలో అవే పరిస్థితి వుందన్నారు. మన ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే సమయం అంటే, మే మొదటివారానికి కోవిడ్ వైరస్ పీక్ స్టేజ్‌కి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు హెచ్చరించడం కరోనా తీవ్రతని సూచిస్తోందన్నారు.
ఇంటికి మూడు మాస్కులివ్వలేని మన ముఖ్యమంత్రి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా పరీక్షలు పెట్టి, 15 లక్షలకు పైగా విద్యార్థుల జీవితాలకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇంటి నుంచి బయటకొచ్చి ఆస్పత్రులలో పరిస్థితులు పరిశీలించి, సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే బాగుంటుందన్నారు. ఏపీ సచివాలయంలో ఇప్పటివరకూ 10 మంది ఉద్యోగులు చనిపోయారని, ఉద్యోగులైన భార్యాభర్తలు కోవిడ్ బారిన పడి మృతి చెందారని, వారి పిల్లలకు దిక్కెవరని ప్రశ్నించారు.
కోవిడ్ కోరలు చాచిన వేళ 15 లక్షల మంది విద్యార్థుల్ని పరీక్షలకు ఒకేసారి రప్పిస్తే వారి తల్లిదండ్రులకు కోవిడ్ వచ్చి మరణిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్లో జగన్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ గంగిరెడ్డి చనిపోయారని, మీ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతారో, అదే బాధ అందరికీ ఉంటుందన్నారు.
కేంద్రం నిర్వహించే పరీక్షలు రద్దు చేసిందని, మెజారిటీ రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేస్తే...ఒక్క మన ముఖ్యమంత్రి ఎందుకు ఇంత మొండిగా పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. పరీక్షలు రద్దు చేయాలని 87 శాతం మంది కోరుతున్నారని అనేక సర్వేలు వెల్లడిస్తున్నా, సర్కారు ఏకపక్ష నిర్ణయాలు సమంజసం కాదన్నారు.
ఇప్పటివరకూ 100 మందికి పైగా టీచర్లు కోవిడ్‌తో చనిపోయారని, ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఉపాధ్యాయుల సంఘం కూడా ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. చదువు చెప్పి..పరీక్షలు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులకు రక్షణలేకపోతే ..పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలా? విద్యార్థులకు రక్షణ లేకపోతే వారిని పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లే తల్లిదండ్రులకు ఎవరు రక్షణ కల్పిస్తారని సర్కారుని లోకేష్ నిలదీశారు.
పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం, ఆన్సర్ పేపర్లు తిరిగి తీసుకోవడం అనే ప్రక్రియలో కోవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని, పేపర్లు కోవిడ్ టచ్ పాయింట్ కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ రద్దు చేయాలి..ప్లస్ టూ వాయిదా వేయాలని 18వ తేదీన ఓ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు.
22వ తేదీన పరీక్షల రద్దు డిమాండ్‌తో మొదటి టౌన్‌హాల్ సమావేశంలో వచ్చిన అందరి అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా పరీక్షలు రద్దు చేయాలనుకునేవారు 9444190000 వాట్సప్ నెంబర్‌కి CBE2021 మెసేజ్ చేయాలని కోరామన్నారు.
ఈ వాట్సప్ నంబర్‌కి పరీక్షల రద్దు కోరుతూ 2 లక్షల 35 వేల మంది మద్దతు ఇచ్చారన్నారు. 1లక్షా 13 వేల మంది తమ అభిప్రాయాలను పంపారని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షల రద్దు చేయించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని గౌరవ గవర్నర్‌గారికి లేఖ రాశానని వివరించారు.
అన్నివర్గాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలపై ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. నేను లేఖ రాసినందు వల్లే పరీక్షలు పెడతామనే మొండి వైఖరి విడనాడాలని సూచించారు. ``నాకెటువంటి ఇగోలు లేవు..నేను రాసిన లేఖలన్నీ విత్‌డ్రా చేసుకుంటాను. దయచేసి పిల్లల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయండి.`` అని నారా లోకేష్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పారిశుద్య కార్మికుల ప్రాణాలు కాపాడాల్సిన బాద్యత ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డిపై వుందన్నారు. పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటారో ..లేదంటే కంసుడు అనిపించుకుంటారో సీఎం జగనే తేల్చుకోవాలన్నారు. పరీక్షల రద్దు ఉద్యమాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి, న్యాయపోరాటం చేయాలా వద్దా అనే అభిప్రాయాలు తెలియజేయాలని అందరినీ కోరారు.
జూమ్ కాన్ఫరెన్స్‌లో దాదాపు 1000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘనేతలు, వివిధరంగాల మేధావులు చేరారు. ఈ సందర్భంగా జూమ్‌లో పెట్టిన పోల్‌లో న్యాయపోరాటం చేయాల్సిందేనని 97 శాతం అభిప్రాయపడ్డారు. పరీక్షలు రద్దుకి న్యాయపోరాటం వెళ్తున్నామని నారా లోకేష్ ప్రకటించారు.