Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేఖ

Advertiesment
డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేఖ
విజయవాడ , సోమవారం, 30 ఆగస్టు 2021 (16:54 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని 'వైఎస్ఆర్‌సిపి అధికార ప్రేరేపిత  పోలీసు రాజ్యం' గా మార్చేసింద‌ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విమ‌ర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న విమర్శ చేసినా, ఒక వర్గం పోలీసులు సాధారణ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నార‌ని పేర్కొన్నారు.
 
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తమ అసమ్మతిని తెలియజేసే అమాయక ప్రజలను అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నార‌ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా గృహ నిర్బంధం చేస్తున్నార‌ని, తప్పుడు కేసులతో వేధిస్తున్నార‌ని పేర్కొన్నారు. 
 
అసమ్మతి వ్యక్తీకరణ అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులలో హామీ ఇవ్వబడిన వాక్ స్వేచ్ఛలో భాగం. ఇది ప్రజాస్వామ్య హక్కు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు రెండూ పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి. ప్రతిపక్ష నాయకులపై వరుస దాడులు చేస్తున్నారు. అందులో తాజాగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు చింతమనేని ప్రభాకర్ అరెస్టు. పెట్రోల్, డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడంపై చింతమనేని ప్రభాకర్ నిరసన వ్యక్తం చేసి, 2021 ఆగస్టు 28 న లేఖ ఇచ్చేందుకు దెందులూరు తహశీల్దార్‌ను కలిశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రభాకర్ పై  ఐ.పి.సి సెక్షన్లు 143, 341, 290, 353, 269, 271 r/w 149 IPC, 32 PA-1861, 51 (a) విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌లు సరిపోవన్నట్లు విశాఖపట్నంలో ప్రభాకర్‌ను అక్రమ అరెస్టు చేశారు. ఒక విపక్ష పార్టీ నాయకుడిని, మాజీ ఎమ్మెల్యేని ఇంత దుర్మార్గంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఆయన చేసిన తప్పా? పోలీసుల ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు ఏ విధంగా నమోదు చేస్తారు? నిరసన ద్వారా అసమ్మతిని తెలియజేయడం చట్టవిరుద్ధమా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.
 
రాబోయే రోజుల్లో పోలీసుల ప్రస్తుత పనితీరు ఒక బ్లాక్ మార్క్‌గా నిలిచిపోతుంది. కనీసం ఇకనైనా లా అండ్ ఆర్డర్ వైఫల్యాలను తెలుసుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని డిజిపికి రాశారు. ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నాయకుడిని సభ్యుడిగా చేర్చినప్పటికీ, ఇప్పటి వరకు ఒక సమావేశం కూడా జరగలేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని నిరూపించుకునేందుకు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష టిడిపి నాయకులపై నమోదు చేసిన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. కనీసం ఇకనైనా పోలీసులు ప్రతిపక్ష టీడీపీ నాయకులను వేధించడం మాని రాష్ట్రంలో నేరాల రేటును నియంత్రించడంపై దృష్టి పెట్టాలి అని చంద్ర‌బాబు కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్ లైన్‌లోనే విద్యా బోధన.. ఆన్‌లైన్ క్లాసులొద్దు...