చంద్రబాబు వ్యూహం... వచ్చే ఎన్నికల్లో ఎంపీగా నారా బ్రాహ్మణి పోటీ
నారా బ్రాహ్మణి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముద్దుల కుమార్తెల్లో ఒకరు. ప్రస్తుతం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు నారా లోకేష్ సతీమణి. ఒక బిడ్డకు తల్లి. ఉన్నత విద్యావంతురాలు. చ
నారా బ్రాహ్మణి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముద్దుల కుమార్తెల్లో ఒకరు. ప్రస్తుతం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు నారా లోకేష్ సతీమణి. ఒక బిడ్డకు తల్లి. ఉన్నత విద్యావంతురాలు. చూడచక్కని అందం. ఈమె వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో నలుగురు కీలక పదవుల్లో ఉన్నారు. ఈ నలుగురే ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. వీరిలో ఒకరు కేసీఆర్ కాగా, రెండో వ్యక్తి ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కుమార్తె టి కవితలు. ఇందులో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్, హరీష్‌లు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. ఇక కవిత నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈమె ఢిల్లీలో తెరాస రాజకీయాలను చక్కబెట్టడంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలోనూ అత్యంత కీలక భూమికను పోషిస్తున్నారు.
ఈ క్రమంలోనే బ్రాహ్మణిని సైతం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలిపించి ఆమెను ఢిల్లీకి పంపాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన తనయుడు నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీంతో ఆయన సతీమణిని సైతం రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు, ఆంగ్ల భాషపై పట్టు ఉన్న బ్రాహ్మణిని ఢిల్లీకి పంపితే ఏపీకి వచ్చే నిధులు, ఇతరత్రా పనుల విషయంలో ఢిల్లీలో పనులు చక్కబెట్టే సామర్థ్యం వస్తుందని బాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణిని గుంటూరు లేదా అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట నుంచి ఎన్నికల బరిలోకి దింపుతారని తెలుస్తోంది. జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. బ్రాహ్మణి అక్కడి నుంచి పోటీచేసే క్రమంలో జయదేవ్‌ను చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని టాక్. ఒక వేళ టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయిస్తే అక్కడ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని బాబు యోచనగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బ్రాహ్మణిని ఎంపీగా బరిలోకి దింపాలన్న బలమైన కోరిక బాబు వ్యక్తం చేస్తున్నారన్న టాక్ టీడీపీలో వినిపిస్తోంది.