Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నంద్యాలలో సలాం ఫ్యామిలీ ఆత్మహత్య.. సీఐ సోమశేఖర్ అరెస్టు!

నంద్యాలలో సలాం ఫ్యామిలీ ఆత్మహత్య.. సీఐ సోమశేఖర్ అరెస్టు!
, ఆదివారం, 8 నవంబరు 2020 (22:20 IST)
కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబంతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే,ఈ ఘటనలో సీఐ సోమశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. చేయని నేరాన్ని అంగీకరించాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్లే సలాం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు వినికిడి. ఈ వ్యవహారంపై సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. 
 
ఈ క్రమంలో ఈ కేసులో ఇప్పటికే సీఐ సోమశేఖర్ రెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు... తాజాగా ఆయన్ను అరెస్టు చేశారు. సీఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఐపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు డీఐజీ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
 
ఇకపోతే, ఈ వ్యవహారంపై ఇద్దరు సభ్యుల విచారణ కమిటీలో భాగంగా ఐజీ శంకబ్రత బాగ్చి కూడా నంద్యాల చేరుకున్నారు. ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం కేసుకు సంబంధించి కొందరు కానిస్టేబుళ్లను ఆయన ప్రశ్నించారు. 
 
గతేడాది నగల దుకాణంలో జరిగిన చోరీకి తనను బాధ్యుడ్ని చేస్తూ పోలీసులు వేధిస్తున్నారని, వారి బెదిరింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అబ్దుల్ సలాం ఓ సెల్పీ వీడియోలో చెప్పడంతో ఈ వ్యవహారంలో స్పష్టత వచ్చింది. 
 
ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు తమ పిల్లలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 
 
ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనమని వ్యాఖ్యానించారు. నంద్యాల ఆత్మహత్యల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల బిరుసు ముఠాతో కలిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు : ఆసీస్‌కు చైనా వార్నింగ్