ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దిగజారుడు రాజకీయాలు చేయద్దని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. టిడీపీకి రెండు సీట్లు వస్తే, చంద్రబాబు ఇంట్లో పాకి పని చేస్తానన్న నారాయణస్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నామన్నారు. అధికారంలోకి రాబోయేది టీడీపీనే అని, మళ్లీ సీఎం సీట్లో చంద్రబాబే కూర్చుంటారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.
నారాయణ స్వామితో పాకి పని చేయించాలనే ఆలోచన జగన్‌కు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దళితులతో పాకి పని చేయించుకోవడం జగన్‌కు అలవాటేమో గాని, ఆత్మాభిమానం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత దళిత జాతిదన్నారు.
దళిత జాతిని అడ్డం పెట్టుకుని, వారితో పనికి మాలిన కామెంట్లు చేయిస్తూ, జగన్ రెడ్డి నీచమైన రాజకీయానికి దిగారన్నారు. పదవులు శాశ్వతం కాదు, ఆత్మాభిమానంతో ఉండాలని నారాయణ స్వామికి సూచిస్తున్నామన్నారు. నారాయణ స్వామితో ఈ తరహా వ్యాఖ్యలు చేయాలని జగనే ఒత్తిడి తెచ్చి ఉంటారని ఆరోపించారు.