ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు... 3వ సారి చంద్రబాబు నాయుడు...
‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-డబ్ల్యూఈఎఫ్) 47వ వార్షిక సదస్సు ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ సమస్యల వలయంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వీటన్నింటి పరిష్కారానికి
‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-డబ్ల్యూఈఎఫ్) 47వ వార్షిక సదస్సు ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ సమస్యల వలయంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వీటన్నింటి పరిష్కారానికి ఈ సదస్సు కీలకం కానుంది. ‘స్పందించే బాధ్యతాయుత నాయకత్వం’-అనే ఇతివృత్తంతో ఈ దఫా సమావేశాలు జరుగనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వేదిక-2017 సదస్సు ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేయనుంది.
వినూత్నమైన, విశ్వసనీయమైన ఒక కార్యాచరణ కోసం ఈ దఫా దావోస్ సదస్సు ప్రపంచానికి మార్గదర్శనం చేయబోతోంది. ఈ ఏడాది ప్రాపంచిక విషయాలను ఒకసారి అవలోకిస్తే విధాన నిర్ణేతలకు, రూపకర్తలకు పరీక్ష ఎదురుకాబోతోందని ఈ వేదిక హెచ్చరించనుంది. సమాజానికి ఆందోళన కలిగిస్తున్న సంక్లిష్టతల గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి ఈ సదస్సు కీలకచర్చలు జరిపే అవకాశం ఉంది. ఓవైపు వివిధ రకాల వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా విశ్వాసాలు సన్నగిల్లుతున్నాయి. మరోవైపు చూస్తే నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలై సాంకేతికత అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలన్నింటినీ ఒక చోటికి చేర్చుతోంది.
పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండే విధానం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందనుంది. ప్రజా జీవనంలో ఎదురవుతున్న సంక్లిష్టతలు, అనిశ్చితి తొలగాలంటే పరస్పరం ఆధారపడే విధానం మరింత ఉత్సాహంగా, సమ్మిళితంగా, సహకారయుతంగా సాగాలి. దీన్ని అత్యవసర ఎజెండాగా ఈ వేదిక భావిస్తోంది. సంపద వృద్ధితో పాటు, భద్రత కోసం మన వ్యవస్థలను మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని ఈ సదస్సు గుర్తుచేయనుంది. అలాగే, మనం మన సామర్ధ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవడానికి గల అనుకూలతలను, అవకాశాలను సదస్సు గుర్తిస్తుంది. ఈ సదస్సులో పలు దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రముఖ సంస్థలకు చెందిన అధినేతలు, సీఈఓలు పాల్గొంటారు. వందకుపైగా దేశాల నుంచి దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
సీఎం చంద్రబాబుకు వరుసగా 3వ సారి ఆహ్వానం
ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రపంచ ఆర్థిక వేదిక’ మేనేజ్‌మెంట్ బోర్డు తరపున ఫిలిప్ రోజియర్ (బోర్డు మెంబర్) గత నవంబరులోనే ఒక లేఖ రాశారు. ఈ వేదిక సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఇలా ఆహ్వానం అందుకోవడం సీఎంకు ఇది వరుసగా మూడో ఏడాది. సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక బృందం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈనెల 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లింది. సీఎం ముందు జ్యూరిచ్ వెళ్లారు. అక్కడ నుంచి దావోస్ వెళతారు. ముఖ్యమంత్రి వెంట ఉన్న బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఇంధన వనరులు, ఐఅండ్ఐ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్య రాజ్ తదితరులు ఉన్నారు.
‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’కు పెట్టుబడులను ఆకర్షించడానికి అంతర్జాతీయ ఆర్థిక వేదిక నుంచి గతంలో సీఎం ప్రయత్నం చేసి విజయం సాధించారు. గతంలో సీఎం పర్యటనల వల్ల నవ్యాంధ్రప్రదేశ్ మీద ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో మనం చేసుకున్న ఎంవోయూల్లో సంఖ్యాపరంగా 48 శాతం గ్రౌండ్ అయ్యాయి. విలువపరంగా 42 శాతం వాస్తవరూపం దాల్చాయి. దావోస్ సదస్సులో ప్రాతిపదిక ఇదే. గత ఏడాదిలానే ఈసారి కూడా సీఎం దావోస్ పర్యటనతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సమకూర్చగలరన్న భావన అందరి మదిలో ఉంది.
నేడు పలు కార్యక్రమాల్లో సీఎం బిజీబిజీ
17వ తేదీన సీఎం దావోస్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీబిజీగా గడుపుతారు. ఉదయం 10 గంటలకు (అక్కడి సమయం) జెట్రో చైర్మన్ హిరోయుకి ఇషిగేతో తొలి సమావేశం జరుపుతారు. ప్రపంచ ఆర్థిక వేదికపైన సీఎం ముఖ్యవక్తగా, ఉపన్యాసకునిగా కొన్ని కీలక అంశాలపై ప్రసంగాలు చేస్తారు. ‘ప్రిపేరింగ్ ఫర్ ద సిటీ సెంచరీ’ అనే అంశంపై ముఖ్య ప్రసంగం చేస్తారు. ఆ తరువాత ‘ఇండియా అండ్ సౌత్ ఏషియా రీజనల్ స్ట్రాటజీ గ్రూపు’ బోర్డ్ రూమ్ డిస్కషన్‌లో భారతదేశం తరపున ప్రతినిధిగా పాల్గొంటారు.
స్మార్ట్ నగరాలపై మాట్లాడతారు. నవీన నగరాల ఏర్పాటు, ప్రణాళికలు, పర్యావరణ హితంగా, మోస్ట్ లివబుల్ సిటీస్‌గా తీర్చిదిద్దుకోవడం, సిటీ గవర్నింగ్, సిటిజెన్ సర్వీసెస్ వంటి అంశాలపై చర్చ వుంటుంది. ఇది చాలా కీలక సమావేశం. ఇందులో వివిధ దేశాధినేతలు, ప్రధానులు పాల్గొంటారు. సాయంత్రం ‘టైమ్ ఇండియా’ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొంటారు. ‘షైర్ ఇంటర్నేషనల్’ కంపెనీ ఇంటర్నేషనల్ హెడ్‌తో సమావేశం అవుతారు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ క్యాంపస్) ఛాన్సలర్ నికోలస్ డిక్స్‌తో మీటింగ్ వుంటుంది. ఆ తరువాత మళ్లీ కొన్ని ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది.
18వ తేదీ ఉదయం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్-సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘ఇండియా అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్ ద న్యూ ఫేజ్ ఆప్ గ్లోబలైజేషన్’ అనే అంశంపై సీఎం మాట్లాడతారు. మధ్యాహ్నం సీఐఐ సీఈవోతో జరిపే రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరవుతారు. ఆ తరువాత ‘న్యూ విజన్ ఫర్ అగ్రికల్చర్: బిల్డింగ్ అండ్ స్ట్రెంగ్తెనింగ్ మల్టీహోల్డర్ పార్టనర్‌షిప్స్’-అనే అంశంపై జరిగే ఇంటరాక్టివ్ లంచ్ సెషన్‌లో మాట్లాడతారు. అదే రోజు సింగపూర్ ఈడీబీ చైర్మన్ బే స్వాన్ గిన్‌తో సమావేశం అవుతారు. గ్లోబల్ ఫైనాన్సింగ్, హెల్త్ కేర్ ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు.
19వ తేదీ వరల్డ్ ఎకనామిక్ లీడర్ల ఇన్‌ఫార్మల్ గేదరింగ్‌లో ఇంటరాక్టీవ్ సెషన్ వుంటుంది. అందులో ఆయన ‘స్ట్రక్చరల్ రిఫామ్స్ ఫర్ ఇంక్లూజీవ్ అండ్ సస్టెయినబుల్ గ్రోత్’ అనే అంశంపై జరిగే డిస్కషన్‌లో పాల్గొంటారు.19న ‘టెక్నాలజీ పయనీర్స్’తో జరిగే ముఖ్యమైన సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు. 20న ‘కంట్రీ లెడ్ యాక్షన్ టు అఛీవ్ ద సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్’ అనే అంశంపై జరిగే వర్కుషాపులో పాల్గొంటారు. ఇవే కాకుండా ఈ పర్యటనలో సీఎం అనేక ద్వైపాక్షిక సమావేశాలు, ఇతర సెషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యులతో చర్చలు కూడా జరుపుతారు.
రాష్ట్రానికి ప్రయోజనాలు
రాష్ట్రంలో సాంకేతికతను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నాం. మరోపక్క స్థిరమైన రెండంకెల వృద్ధి సాధనలో ఇంకా మంచి ఫలితాలను రాబట్టడం కోసం పెద్దఎత్తున కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ఏ ఒక్క అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బ్రాండ్ ఏపీ ప్రచారానికి, పెట్టుబడులు రాబట్టడానికి దావోస్ సదస్సు ఓ మంచి అవకాశం. దీని ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పర్యటలో సీఎం దావోస్ వేదికగా స్టాన్‌ఫోర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, కాలిఫోర్నియా యూనివర్శిటీ (బర్కిలీ క్యాంపస్) వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతారు.
కేంబ్రిడ్జి యూనివర్శిటీతో చర్చించి అమరావతిలో ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ రీసెర్చ్’ ఏర్పాటుపై ఒక అవగాహన ఒప్పందం చేసుకునే అవకాశాలు వున్నాయి. జనరల్ ఎలక్ట్రికల్స్, జెట్రో, జైకా, లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్, మెడ్‌ట్రానిక్, సిస్కో, వాగ్నిజెన్ యూనివర్శిటీ, ఏఈసీఓఎం, మాస్టర్ కార్డ్,, టైసిన్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ గ్లోబల్ హెల్త్ అండ్ హెల్త్ కేర్, గ్లోబల్ ఫండింగ్ వంటి సంస్థలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. సీఎం ప్రతినిధి బృందం ఈ పర్యటనలో దాదాపు 50 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతుంది.
ప్రాధాన్యతా రంగాలు
గ్లోబల్ ఫండ్స్, ఫైనాన్సింగ్, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్ (తయారీరంగం), స్మార్ట్ సిటీస్, సోలార్ వంటి రంగాలకు ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన ప్రపంచ పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి సమావేశాలు జరుపుతారు. ఈ సారి రాజధాని అమరావతి నిర్మాణం, మెట్రోరైలు ప్రాజెక్టు వంటివాటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలు, అపారమైన వనరులు, నైపుణ్యత గల మానవవనరులు, ప్రభుత్వ విధానాల గురించి వివరిస్తారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల వాతావరణం, ఏకగవాక్షవిధానం ద్వారా అనుమతులు ఇవ్వడం వంటి అంశాల నేపధ్యంలో ఈ సారి కూడా మన రాష్ట్రానికి వివిధ రంగాలలో విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంటుదని భావిస్తున్నారు.