అవినీతిరహితమైన, బాధ్యతతో కూడిన వ్యవస్థ నిర్మాణానికి ఆఖరి శ్వాస వరకు పని చేస్తాననీ, అందుకు మీ అందరి సహాయ, సహకారాలు అవసరమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అన్నవరంలో తుని నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "చాలా బాధ్యతతో కూడిన పొలిటికల్ పార్టీ నడుపుతున్నాం. మీకు సినిమా యాక్టర్‌గా తెలిసి ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా చూడాలనుకోవచ్చు. నేను మాత్రం ఏదీ సరదాగా తీసుకోవడం లేదు. జనసేన పార్టీ ఒక్క ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదు.
మేం ఎంత బాధ్యతగా ఉన్నామో, కార్యకర్తలు కూడా అంతే బాధ్యతతో పని చేయాలి. సరికొత్త రాజకీయ వ్యవస్థని తీసుకురావాలి. అరుపులు కేకలు కాదు, పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. పార్టీ పెట్టాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు. 2003లోనే రాజకీయాల్లోకి వెళ్లబోతున్నా అని నా తల్లికి చెప్పా. సినిమాలు చేసుకోక ఎందుకు అంది. నాకు సినిమాల మీద మమకారం లేదు. సినిమాల్లో ఓ సమస్య మీద అవగాహన మాత్రమే కల్పించగలం. సమస్యని పరిష్కరించలేం.
సినిమాలు చేస్తూ ఉద్ధానం సమస్య పరిష్కరించగలమా.? సినిమాలు చేస్తూనే రాజకీయాలకి సిద్ధమయ్యా. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు నా తల్లి నన్ను ఆశీర్వదించింది. నా తల్లి నన్ను దేశ ప్రజలకి దత్తత ఇచ్చేసింది 'వీడు దేశం బిడ్డ' అని. నువ్వు నా బిడ్డవి కాదు, నీది పెద్ద కుటుంబం, నువ్వు దేశానికి సంబంధించిన వ్యక్తివి అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. నాకు మద్దతు ఇస్తూ పింఛన్ డబ్బు నుంచి రూ.4 లక్షలు ఆఫీస్‌కి వచ్చి ఇచ్చింది అని చెప్పారు.