Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామకృష్ణను బెదిరించినట్లు వ‌న‌మా రాఘవ అంగీకారం

రామకృష్ణను బెదిరించినట్లు వ‌న‌మా రాఘవ అంగీకారం
విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (17:44 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబం ఘటన సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసులో నిందితుడు వనమా రాఘవ అరెస్టుపై ఏఎస్పీ రోహిత్ రాజ్‌ మీడియాతో మాట్లాడారు. 
 
 
ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్‌ పోసి తానూ నిప్పంటించుకున్నారు. ఘటనాస్థలిలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దకుమార్తె సాహితీ మృతి చెందింది. ఈ నెల 3న రామకృష్ణ బావమరిది జనార్దన్‌ ఫిర్యాదుతో పాల్వంచ పీఎస్‌లో కేసు నమోదు చేశామ‌ని, ఎఎస్పీ తెలిపారు. ఐపీసీ 302, 307, 306 సెక్షన్ల కింద కేసు పెట్టామ‌న్నారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సూసైడ్ నోట్‌, సెల్ఫీ వీడియోలో వనమా రాఘవపై ఆరోపణలు చేశారు. ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయని వీడియోలో చెప్పారు. రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే చనిపోతున్నట్లు తెలిపారు. 
 
 
నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామ‌ని, నిన్న రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నామ‌ని ఏఎస్పీ తెలిపారు. దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశామ‌ని,  పలు అంశాలపై రాఘవను విచారించామ‌ని చెప్పారు. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించార‌ని, లభ్యమైన ఆధారాలను సీజ్‌ చేసి కోర్టుకు సమర్పించామ‌న్నారు.


నిందితులను ఇవాళ కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామ‌ని, రాఘవపై మొత్తం 12కేసులు ఉన్నాయన్నారు. గతంలో నమోదైన కేసులపై కూడా విచారణ జరుపుతామ‌ని, కేసు దర్యాప్తు దశలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమ‌న్నారు. వనమా రాఘవపై ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రాలేద‌ని ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనగర్‌ మంచు వర్షం.. 2.6 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు