తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్నదాత లోగిళ్లు ఆనందాల సిరులతో కళకళలాడుతున్నాయని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా వరుసగా రెండో ఏడాది రెండో విడత ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రైతులకు మంగళవారం విడుదల చేసింది.
ఒక్కో రైతుకు రూ.4వేలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే ప్రభుత్వం జమచేసింది. ఈ సందర్భంగా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యురాలు విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అన్నదాతల కోసం ఎందాకైనా వెళ్తుందని చెప్పారు. అన్నదాతలకు వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందజేస్తామన్నారు.
చరిత్రలో నిలిచిపోయే పథకం వైఎస్సార్ రైతు భరోసా
వైఎస్సార్ రైతు భరోసా పథకం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే రజిని గారు చెప్పారు. తాము ఎన్నికల సమయంలో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.12500 చొప్పున రూ.50వేలు మాత్రమే అన్నదాతకు పెట్టుబడి సాయం కింద ఇస్తామని హామీ ఇచ్చామని, కానీ అంతకు మించి ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు మొత్తం 67,500 ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు.
తాము హామీ ఇచ్చిన దానికంటే కూడా రూ.17,500 అదనంగా రైతులకు అందజేస్తున్నామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులు, అటవీ, అసైన్డ్ భూములు సాగుచేసుకుంటున్నవారికి కూడా అందజేస్తూ చరిత్ర సృష్టించామని చెప్పారు. అన్నదాతలు సాగుచేసిన పంటలకు కచ్చితంగా మద్దతు ధర దక్కేలా పంటల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి సాయం చేస్తున్నామన్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో కర్షకులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధిని ఏర్పాటుచేసి ఆర్థిక సాయం అందజేస్తున్నామని వెల్లడించారు. తాజాగా వరదల వల్ల నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు ఈ రోజే రూ.135.73 కోట్లను నేరుగా బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకే జమచేశామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఇంత త్వరగా నష్టపరిహారాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదని తెలిపారు.
అన్నదాతకు ఎప్పుడూ అండగా
తమ ప్రభుత్వం రైతన్నకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. అన్నదాతకు తమ ప్రభుత్వం మూడో చేయిలా పనిచేస్తుందన్నారు. జవాను చేతిలో తుపాకి ఎలానో.. అన్నదాత చేతిలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అలా అని తెలిపారు.
జవాను చేతిలో తుపాకి దేశాన్ని కాపాడితే.. అన్నదాత చేతిలో ఉన్న వైఎస్సార్ రైతు భరోసా పథకం మన రాష్ట్ర రైతన్నను కాపాడుతో్ందని చెప్పారు. ఉచితంగా బోర్లు, మోటార్లు రైతులకు అందించేందుకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకం దోహదపడుతుందని చెప్పారు. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి రైతు గుండెలో కొలువై ఉంటారని వెల్లడించారు.
తాము అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పంటలు బాగా పండుతున్నాయని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కూడా బాగున్నాయని, అన్నదాత కష్టాలు తీరిపోయాయని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ మాధురి, అగ్రికల్చర్ ఆఫీసర్ సరిత, ఈఓపిఆర్డీ శ్రీనివాసరావు, ఏపీఎం జీవన్, మండల అధ్యక్షులు కల్లూరి బుజ్జి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా విఘ్నేశ్వర రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, ఎడ్లపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు, కాకుమాను విజయ్, కాకుమాను బ్రహ్మయ్య, కాకుమాను శ్రీను, ఓరుగంటి రామచంద్రయ్య, మద్దూరి భాస్కర్ రెడ్డి, వీరారెడ్డి, వడ్డేపల్లి నరసింహారాజు, పందుల బుల్లెబ్బాయి, ముద్దన రామయ్య, కర్నాటి సుబ్బారావు, హుజఫా, అంకారావు, జాకీర్, బుజ్జి, బసల శివరామకృష్ణ, గౌరీ హనుమంతరావు, అన్నలదాసు శ్యాం పాల్, పావులూరి వాసు, పల్లపు మంగయ్య మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.