తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులోభాగంగా, గురువారం లేపాక్షిలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, తన చివరి రక్తపుబొట్టు వరకు రాయలసీమ అభివృద్ధికి పాటుపడతానని ఆయన ప్రకటించారు.
ఆ సమయంలో ఉన్నట్టు కరెంట్ పోయింది. దీంతో బాలయ్య స్పందిస్తూ, ఓహో... ఇదా ఈ ప్రభుత్వ పాలన తీరు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ పాలన పోయిన వెంటనే కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో విత్తనాల కొరత, కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు.
కాగా, ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో కేవలం మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. వాటిలో ఒకటి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుపొందగా, హిందూపురం నుంచి బాలయ్య, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌లు గెలుపొందారు. రాయలసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. వీరిలో అనేక మంది మంత్రులు కూడా ఉన్నారు.