Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్ర‌బాబు ఎందుకు ఏడ్చాడో చెప్పాలి... ఎమ్మెల్యే అంబటి రాంబాబు

Advertiesment
mla ambati rambabu
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (18:38 IST)
వరుస ఓటములతో టీడీపీ పుట్టి మునిగిపోవడంతో, రాజకీయ అమ్ములపొదిలో ఏ అస్త్రాలు లేక, చివరి అస్త్రంగా ఏడుపు అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సచివాలయంలోని మీడియా పాయింట్ లో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ, పదవి కన్నా, మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ తనకు ముఖ్యం కాదని, ఈరోజు తన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగటం మరోసారి బాబు తన నీచ మనస్తత్వాన్ని రుజువు చేసుకున్నారని దుయ్యబట్టారు. 
 
 
పదవి కోసం చంద్రబాబు, ఎన్ని ఘోరాలు, నేరాలు చేశారో రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఇంత కాలం ప్రజల్ని ఏడిపించిన చంద్రబాబు.. మీడియా ముందుకు వచ్చి ఏడ్చాడంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు.. నాడు ఎన్టీఆర్ ను..  నేడు భార్యను అడ్డుపెట్టుకుని దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని తూర్పూరబట్టారు. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఏడ్చేసి సానుభూతి పొందాలంటే ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు అసెంబ్లీని నిష్క్రమించడం కాదని, రాజకీయాల నుంచే నిష్క్రమణ ఖాయమని చెప్పారు. చంద్రబాబు భార్య గురించి సభలో ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడలేదని, మాట్లాడారని మీ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 
 
 
చంద్రబాబు నాయుడు  మళ్లీ శాసన సభకు రానని, వస్తే మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే వస్తానని శపథం చేసి సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇలాంటి శపథం ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో, టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, "నా భార్యను కించపరిచే మాటలు అన్నారు. ఇది నీచమైన రాజకీయం. అందుకే రాజకీయాల మీద విరక్తి కలిగింది. అందుకే అసెంబ్లీకి వెళ్లనని చెప్పాను" అంటూ కంటతడి పెట్టిన బాబు అస‌లు ఆయ‌న భార్య‌ను ఎవ‌రు, ఏమి అన్నారో స్ప‌ష్టం చేయాల‌న్నారు. 
 
 
మేము సూటిగా అడుగుతున్నాం.. అసెంబ్లీలో నేను కానీ, నా ముందు మాట్లాడివాళ్లు కానీ, నా తర్వాత మాట్లాడి మంత్రులు, ఎమ్మెల్యేలుకానీ ఎక్కడా...  "మీ భార్యను కానీ, మీ కుటుంబసభ్యుల గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు, ప్రస్తావించలేదు." ఆ విధంగా మేము మాట్లాడినట్లు ఆధారాలు ఉంటే చూపించండి. ఆధారాలు చూపించకుండా గుడ్డ కాల్చి మొహాన వేసినట్లు ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన రాజకీయం అని ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు.
 
 
చంద్రబాబు నాయుడు అర్థాంగి భువనేశ్వరిని ఏదో అన్నామని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ కుమార్తె అయిన ఆమెను మేం కానీ, మా పార్టీవాళ్లు కానీ ఏమీ అనలేదని చేతులు జోడించి నమస్కరించి మరీ ఆమెకు చెబుతున్నాం. మహిళలను అనేటువంటి స్వభావం మాది కాదు. అనని విషయాలను అన్నట్లుగా చిత్రీకరించి రాజకీయలబ్ది పొందాలనుకుంటున్నారు చంద్రబాబు అని రాంబాబు విమ‌ర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంట్రోల్... కంట్రోల్... కార్య‌క‌ర్త‌ల‌ను వారిస్తున్న నారా లోకేష్!